అక్షరటుడే, ఇందూరు :Telanagana Diagnostics | ఏదైనా జబ్బుతో ఆస్పత్రికి వెళ్తే.. వైద్యులు ముందుగా రక్త పరీక్షలు (Blood Test) చేయిస్తారు. అప్పుడే వ్యాధి నిర్ధారణ అవుతుంది. ఆ తర్వాతే చికిత్సకు ఆస్కారం ఉంటుంది. అయితే ప్రభుత్వం ఉచిత పరీక్షలు నిర్వహించే.. తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లో పలు యంత్రాలు పని చేయడం లేదు. దీంతో రక్త పరీక్షలకు ఇబ్బందులు తలెత్తి రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
నిజామాబాద్ జీజీహెచ్(GGH)తో పాటు జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో సేకరించిన రక్త నమూనాల పరీక్షలు చేయడానికి తెలంగాణ డయాగ్నొస్టిక్ (Telangana Diagnostic) ఏర్పాటు చేశారు. చికిత్స కోసం వచ్చే వారికి రక్త పరీక్షల కోసం ఈ హబ్ పని చేస్తుంది. ఇందులో మొత్తం 138 రక్త పరీక్షలను చేసేలా యంత్రాలను సమకూర్చారు. కానీ గత 15 రోజులుగా కొన్ని యంత్రాలు మొరాయించడంతో పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించడం లేదు. దీంతో రక్త నమూనాలు ఇచ్చిన రోగులకు మూడు రోజులకు గాని ఫలితాలు అందడం లేదు.
Telanagana Diagnostics | చికిత్స ఆలస్యం
ప్రభుత్వ ఆస్పత్రులకు(Government Hospitals) వచ్చే రోగుల రక్త పరీక్షల ఫలితాలు ఆలస్యంగా రావడంతో చికిత్స కూడా సరైన సమయానికి అందడం లేదు. వ్యాధి నిర్ధారణకు వైద్యులు రక్త పరీక్షలకు సిఫారసు చేస్తున్నారు. కానీ ఫలితాలు రెండు.. మూడు రోజులకు రావడంతో రోగులకు ఆలస్యంగా చికిత్స అందడంతో పాటు అనేక సార్లు తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా జిల్లా జనరల్ ఆసుపత్రిలో నిత్యం 1,500 నుంచి 2వేల వరకు ఓపీ నమోదవుతుంది. ఇందులో వందల సంఖ్యలో చికిత్స కోసం ఆస్పత్రిలో అడ్మిట్ అవుతున్నారు. వీరిలో చాలామందికి రక్త పరీక్షలకు సిఫారసు చేస్తున్నారు. కానీ యంత్రాలు పనిచేయని కారణంగా సరైన సమయానికి ఫలితాలు అందడం లేదు.
Telanagana Diagnostics | పర్యవేక్షణ కరువు
జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ఆస్పత్రుల నుంచి వచ్చిన రక్త నమూనాలకు తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లోనే పరీక్షలు చేస్తారు. అన్ని రకాల పరీక్షలు కలిపి ప్రతిరోజు సుమారు 500 పైబడి ఉంటాయి. వీటికి సరిపడా రసాయనాలు సరిపోవడం లేదని సమాచారం. నిత్యం వందల సంఖ్యలో పరీక్షలు చేయడంతో ఓవర్ లోడ్(Over Load)తో యంత్రాలు కూడా మొరాయిస్తున్నాయని తెలుస్తోంది. అయితే వీటిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం కూడా నిర్వహణ లోపానికి కారణం వుతుంది.

Telanagana Diagnostics | మూడో రోజు రిపోర్టు వచ్చింది
మోహన్, మల్లారం
మా బంధువుకు ఊపిరితిత్తుల సమస్య వచ్చి ఆస్పత్రిలో అడ్మిట్ చేశాం. మొదటిరోజు రక్త నమూనాలు సేకరించి హబ్ కు పంపించారు. రిపోర్టు మరుసటి రోజు వస్తుందని చెప్పారు. కానీ మూడు రోజులుగా తిరిగితే గానీ అందలేదు.
Telanagana Diagnostics | ఇక్కడే ఉండిపోయా..

శేఖర్, నవీపేట
మా బాబుకు ఆరోగ్యం బాలేదని జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చా. రక్త పరీక్ష చేయించుకోవాలని వైద్యులు (Doctors)సూచించారు. శాంపిల్స్ ఇచ్చాం. మరుసటి రోజు ఫలితాలు వస్తాయని చెప్పారు. దీంతో నిజామాబాద్‌లోనే ఉండిపోయాను.