అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Project Kusha | ఇజ్రాయెల్(Israel)పై హమాస్ దాడి చేసిన సమయంలో ఆ దేశ గగన తల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ (Iron Dome) ఎంతో ప్రభావం చూపించింది. హమాస్ ప్రయోగించిన వందల రాకెట్లను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సిస్టం మధ్యలోనే ఆపేసింది.
ఆ సమయంలో గగనతల రక్షణ వ్యవస్థ గురించి అన్ని దేశాలు ఆలోచించడం మొదలు పెట్టాయి. భారత్ కూడా శత్రుదేశాల నుంచి రక్షణ కోసం రష్యా నుంచి ఎస్–400 ను కొనుగోలు చేసింది. ఇటీవల ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో పాక్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లను సుదర్శన చక్ర(ఎస్–400) సమర్థవంతంగా అడ్డుకుంది. అయితే భారత్ సొంతంగా గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దానికి ప్రాజెక్ట్ కుశ (Project Kusha) అని పేరు పెట్టింది. ఇటీవల భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రాజెక్ట్ కుశను వీలైనంత వేగంగా అందుబాటులోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తోంది.
Project Kusha | స్వదేశీ టెక్నాలజీతో..
రక్షణ సాంకేతిక పరిజ్ఞానంలో స్వయం సమృద్ధి దిశగా భారీ ముందడుగు వేస్తోంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ కుశ కింద రష్యా యొక్క S-400 మాదిరిగా సొంతంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను డెవలప్ చేస్తోంది. ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే క్షిపణి (SAM) వ్యవస్థను రూపొందిస్తోంది.
Project Kusha | వచ్చే ఏడాది ప్రయోగాలు..
దూరం నుంచే శత్రుదేశాల లక్ష్యాలను ఛేదించడానికి భారత్ ప్రాజెక్ట్ కుశ ను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ మరో 12 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం ప్రయోగాలు చేయనున్నారు. దీని పనితీరు పరీక్షించడానికి ప్రాజెక్ట్ కాల వ్యవధి 12 నుంచి 36 నెలలు పొడిగించే అవకాశం ఉంది. బీఈఎల్(BEL) అధునాతన నియంత్రణ వ్యవస్థలు, రాడార్ టెక్నాలజీ(Radar Technology)ల వంటి ప్రాజెక్ట్ కుషా యొక్క ముఖ్యమైన ఉపవ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది.
Project Kusha | త్వరలో మరిన్ని ఎస్–400 వ్యవస్థలు
భారత్ రష్యా నుంచి ఐదు S-400 యూనిట్లను కొనుగోలు చేయడానికి 2018లో ఒప్పందం చేసుకుంది. దీని విలువ 5.4 బిలియన్ డాలర్లు. దీని ప్రకారం రష్యా ఇప్పటికే భారత్‌కు మూడు ఎస్–400 యూనిట్లను డెలివరీ చేసింది. ఇటీవల భారత్– పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో మిగతా రెండు యూనిట్లను కూడా త్వరగా డెలివరీ చేయాలని భారత్ కోరింది. దీంతో 2026 చివరి నాటికి మిగిలిన యూనిట్లకు అందించేందుకు రష్యా ఏర్పాట్లు చేస్తోంది.
ఎస్–400 వ్యవస్థతో ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది. అయితే మేకిన్ ఇండియా(Make in India) వైపు మళ్లుతున్న భారత్.. గగన తల రక్షణ వ్యవస్థలోనూ దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ అవసరం అని భావించింది. ఈ క్రమంలో ప్రాజెక్ట్ కుశ మొదలుపెట్టింది. గగనతల రక్షణలో స్వదేశీ టెక్నాలజీతో రూపొందుతన్న ప్రాజెక్ట్ కుశ ఒక కీలక అడుగు కానుంది. ప్రయోగాలు విజయవంతం అయి ఇది అందుబాటులోకి వస్తే భారత్ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది.