అక్షరటుడే, వెబ్డెస్క్:Sajjala Ramakrishna Reddy | ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీడీపీ, వైసీపీ విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయాలు హీటెక్కాయి.
వైఎస్ జగన్(YS Jagan) సొంత జిల్లా కడపలో టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని(TDP Mahanadu Program) విజయవంతంగా నిర్వహించింది. మహానాడు వేదికగా టీడీపీ నాయకులు వైసీపీపై విరుచుకుపడ్డారు. మహానాడుతో టీడీపీ శ్రేణుల్లో జోష్ వచ్చింది. దీంతో వైసీపీ సైతం రంగంలోకి దిగింది. టీడీపీ హామీలపై నిలదీసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వ అరాచకపాలనపై వెన్నుపోటు దినం నిర్వహిస్తామని వైసీపీ స్టేట్ కో- ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) తెలిపారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 4తో ఏడాది పూర్తవుతుంది. ఏడాది అవుతున్నా ఒక్క హామీ నెరవేర్చలేదని సజ్జల అన్నారు. ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్ట్‌లు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సాధ్యంకాని హామీలు అమలు చేస్తామని ప్రగల్భాలు పలికారని విమర్శించారు.
అప్పుడు చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) మామకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఇప్పుడు హామీలు విస్మరించి ప్రజలకు స్ట్రెయిట్ పోటు పొడిచారన్నారు. హామీలు అమలు చేయకపోవడంపై జూన్ 4న వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఏడాదిలో హామీలు అమలు చేయకపోగా రూ.1.50 లక్షల కోట్ల అప్పు చేశారని సజ్జల పేర్కొన్నారు.