
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad University | ప్రకృతిని ఇష్టపడే ప్రేమికులు ఎందరో ఉన్నారు. అయితే హైదరాబాద్ నగరంలో ప్రకృతిని ఆస్వాదించడానికి సరైన ప్రదేశాలు లేవు అని చాలా మంది భావిస్తుంటారు.
అరుదైన పక్షులు, పక్షుల కిలకిల రాగాలు, చెట్ల పొదల్లో నుంచి వచ్చే పిల్లగాలులు, వన్యప్రాణుల అరుపులు ఇవన్నీ వింటుంటే ఆ ఆనందమే వేరు. అయితే హైదరాబాద్ నగరంలో విస్తరించి ఉన్న హైదరాబాద్ విశ్వవిద్యాలయం (Hyderabad University) అనేది జ్ఞానం, ప్రకృతి, కళ, సంస్కృతి అన్నీ కలిసి ఉన్న అరుదైన ప్రదేశం. ఇక్కడ అడవిలా విస్తరించిన హరితవనం, శాంతియుత వాతావరణం, విభిన్న జాతుల జంతువులు, పక్షులు మరియు పూలతో నిండిన ఉద్యానవనాలు ప్రతి విద్యార్థి మనస్సులో ముద్ర వేసుకుంటాయి.
HCU Lands | ప్రకృతి ప్రేమికులని ఆకట్టుకునేలా..

సుమారు 2300 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ క్యాంపస్ హైదరాబాద్ నగరానికి గుండెకాయ లాంటిది. రహదారుల వెంట ఉన్న చెట్ల నీడల్లో నడవడం అసలైన ఆనందం. పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇక్కడ చూడవచ్చు. అడవిలో కనిపించే మయూరాలు, చిలుకలు, నెమళ్లు, మొసళ్ళు సహా ఎన్నో జీవజాలాలు మన కళ్లకు కనబడతాయి. 1974లో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం విద్యా (University education) రంగంలో మాత్రమే కాదు, ఆలోచనల స్వేచ్ఛకు నిలయంగా కూడా పేరు గడించింది. ప్రతి భవనం ఒక ప్రత్యేక శిల్పకళారూపం. School of Humanities, Social Sciences, Life Sciences మొదలైన విభాగాల్లో ఉన్న భవనాలు అందమైన నిర్మాణాలుగా చెప్పుకోవచ్చు.

సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఉండే నీటి చెరువు వద్ద ఉదయం సూర్యోదయాన్ని చూస్తూ.. పక్షుల కిలకిల ధ్వనిలో నడవడాన్ని ప్రతి ఒక్క విద్యార్ధి ఆస్వాదిస్తారు. ఇలాంటి పర్యావరణాన్ని, అందాన్ని మనసారా ఆస్వాదించడమే కాదు, భవిష్యత్ తరాలకూ కాపాడే బాధ్యత మనదే.
అయితే డాక్టర్ విజయ్ పి. కనవాడే Dr. Vijay P. Kanawade వాతావరణ శాస్త్రవేత్త, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఎర్త్, ఓషన్ మరియు అట్మాస్ఫియరిక్ సైన్సెస్ సెంటర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన అద్భుతమైన చిత్రాలు క్యాప్చర్ చేశారు. ఇవి చూస్తుంటే మన హైదరాబాద్ సిటీలో (Hyderabad City) ఇంత ప్రకృతి అందాలు దాగి ఉన్నాయా? అని అందరు ఆశ్చర్యపోతున్నారు. విశ్వవిద్యాలయ క్యాలెండర్ 2025 కోసం డాక్టర్ విజయ్ పి. కనవాడే అందమైన దృశ్యాలు క్యాప్చర్ చేశాడు. అతని ఫొటోగ్రఫీ టాలెంట్‌ని మెచ్చుకుంటూ.. ఇలాంటి మంచి ఫొటోలని తమకు అందించినందుకు యూఓహెచ్ కృతజ్ఞతలు తెలియజేసింది.
