అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Medical Shops | ప్రస్తుతం ఏ గ్రామంలో చూసిన కనీసం రెండు, మూడు మెడికల్ షాపులు ఉంటున్నాయి. ఎలాంటి అర్హత లేని వారు మందుల దుకాణాలు నడుపుతున్నారు.
అనుమతులు లేకుండా మందులు(Medicine) విక్రయిస్తున్నారు. కొందరు ఇతరుల సర్టిఫికెట్లతో లైసెన్స్ పొంది మెడికల్ షాపులు (Medical shops) నిర్వహిస్తున్నారు. అంతేగాకుండా డాక్టర్ చీటి లేకుండానే ఇష్టారాజ్యంగా మందులు విక్రయిస్తున్నారు. ఇలాంటి వారి ఆట కట్టించడానికి అధికారులు చర్యలు చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు(drug controll officers) ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకున్నా పలు మెడికల్ షాపుల్లో మత్తు టాబ్లెట్స్ అమ్ముతున్నట్లు గుర్తించారు. దీంతో 142 మెడికల్ షాపులకు నోటీసులు ఇచ్చి, కేసులు నమోదు చేశారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే యాంటి బయాటిక్స్ తదితర మందులు ఇష్టారీతిన అమ్ముతున్నట్లు గుర్తించారు. పలు దుకాణాల్లో జెనరిక్ మందులను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అధికారుల తనిఖీల నేపథ్యంలో మెడికల్ దుకాణాల నిర్వాహకుల్లో భయం నెలకొంది.
అక్రమ మత్తమందు అమ్మకాలను అరికట్టేందుకు అధికారులు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 142 మెడికల్ షాపులపై దాడులు నిర్వహించి, కోడైన్ కలిగిన దగ్గు సిరప్, నైట్రావెట్ (నైట్రాజెపం) టాబ్లెట్స్, అల్ప్రాజోలం, ట్రామాడోల్, జోల్పిడెమ్, టైడోల్ మొదలైన మందులను అక్రమంగా అమ్ముతున్నట్లు గుర్తించారు. కాగా.. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.