అక్షరటుడే, లింగంపేట : Lingampet | తన తల్లిని కాదని మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన తండ్రిని కుమారుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన లింగంపేట(Lingampet ) మండలం అయ్యపల్లితండా(Ayyapalli thandaలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అయ్యపల్లి తండాకు చెందిన దేవ సోత్ ఫకీరాకు(46)కు పంగీ అనే మహిళతో 25 ఏళ్ల క్రితం వివాహం అయింది. వీరికి కుమారుడు ప్రకాశ్ నాయక్, కూతురు ఉన్నారు. కూతురికి పెళ్లి చేశారు.
ఫకీరా పర్మల్ల తండాకు చెందిన ఓ మహిళను రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అయితే దీనికి కుమారుడు వ్యతిరేకించాడు. పెళ్లీడుకు వచ్చిన కుమారుడు ఉండగా.. రెండో పెళ్లి ఎందుకుని ఇంట్లో కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పలుమార్లు పంచాయితీలు జరగ్గా తండావాసులు, బంధువులు సర్ది చెప్పారు. అయితే శనివారం రాత్రి సైతం తండ్రి కొడుకులు మరోసారి గొడవ పడ్డారు.
ఈ క్రమంలో ఇటీవల కొత్తగా నిర్మించిన ఇంటిని గ్యాస్ సిలిండర్‌కు నిప్పు అంటించి పేల్చేస్తా అని ఫకీరా అన్నాడు. దీంతో ఆవేశానికి గురైన ఆయన కుమారుడు ప్రకాశ్ గొడ్డలితో తండ్రిని నరికాడు. తీవ్రంగా గాయపడ్డ ఫకీరా అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఏఎస్సై ప్రకాష్ నాయక్ తెలిపారు.