Trump
Donald Trump | యాపిలే కాదు.. అన్ని ఫోన్ల‌పైనా బాదుడు.. బాంబు పేల్చిన అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌..

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రో బాంబు పేల్చారు. అమెరికాలోనే త‌యారు చేయాల‌ని ఐఫోన్లు ఉత్ప‌త్తి చేసే యాపిల్‌ను బెదిరించిన ట్రంప్‌(Trump).. తాజాగా ఈ నిబంధ‌న అన్ని స్మార్ట్‌ఫోన్ త‌యారీ కంపెనీల‌కు వ‌ర్తిస్తుంద‌ని వెల్ల‌డించారు. అమెరికాలో ఐఫోన్ల‌ను(iphones) త‌యారు చేయ‌ని ప‌క్షంలో 25 శాతం టారిఫ్ విధిస్తామ‌ని ట్రంప్ శుక్ర‌వారం యాపిల్ సంస్థ‌ను హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా దీనిపై మ‌రోసారి స్పందించిన ట్రంప్‌.. యాపిల్‌, సామ్‌సంగ్ స‌హా అమెరికాలో విక్ర‌యించే అన్ని స్మార్ట్ ఫోన్ల‌కు టారిఫ్ నిబంధ‌న వ‌ర్తిస్తుంద‌ని చెప్పారు. వైట్‌హౌస్(White House) వ‌ద్ద మీడియాతో మాట్లాడిన ఆయ‌న.. అమెరికాలో తయారు చేయని అన్ని స్మార్ట్‌ఫోన్ల‌పై సుంకాలు త‌ప్ప‌వ‌ని తేల్చి చెప్పారు. స్మార్ట్‌ఫోన్ తయారీపై తన వైఖరి ఆపిల్‌కు ఉన్నట్లే అమెరికాలో విక్రయించే అన్ని కంపెనీలకు కూడా వర్తిస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. 25% సుంకం శామ్‌సంగ్, ఇతర స్మార్ట్‌ఫోన్ తయారీదారులకు కూడా వర్తిస్తుందని తెలిపారు. యాపిల్ ఒక్క‌టే కాదు ఇంకా చాలా ఉన్నాయి. శామ్‌సంగ్ అయినా, ఇంకే సంస్థ అయినా త‌మ ఉత్ప‌త్తుల‌ను అమెరికాలోనే త‌యారు చేయాలి. ఇక్క‌డ ప్లాంట్ నిర్మిస్తే వారికి ఎలాంటి టారిఫ్‌(Tariff)లు వ‌ర్తించ‌వు. అలా కాకుండా ఇత‌ర దేశాల్లో ఉత్ప‌త్తి చేసిన‌వి తీసుకొస్తే మాత్రం అది న్యాయ‌మైన ప్ర‌క్రియ కాద‌ని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Donald Trump | ఏమిటి 25% సుంకం ?

అమెరికా(America)లో తయారు చేయ‌కుండా, విదేశాల నుంచి తీసుకొచ్చి విక్ర‌యించే యాపిల్ సంస్థ‌పై 25% సుంకం విధిస్తానని ట్రంప్ శుక్ర‌వారం బెదిరించారు. భార‌త్ స‌హా ఇత‌ర దేశాల్లో యాపిల్ ప్లాంట్ల‌ను స్థాపించ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని యాపిల్ సీఈవో టిమ్ కుక్‌కు తాను చెప్పాన‌ని తెలిపారు. అమెరికాలో విక్రయించే ఐఫోన్లను “భారతదేశంలో లేదా మరెక్కడా కాదు, అమెరికాలో తయారు చేసి నిర్మించాలి” అని ట్రంప్ త‌న సోష‌ల్ మీడియా ట్రూత్‌లో పోస్ట్ చేశారు. లేకపోతే 25% సుంకాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చ‌రించారు.

Donald Trump | శామ్‌సంగ్‌కు దెబ్బే..

ట్రంప్ నిర్ణ‌యం శామ్‌సంగ్‌కు పెద్ద దెబ్బేన‌ని మార్కెట్ విశ్లేష‌కులు చెబుతున్నారు. ద‌క్షిణ కొరియాకు చెందిన దిగ్గ‌జ మొబైల్ కంపెనీ శామ్‌సంగ్‌(Samsung).. అమెరికా మార్కెట్‌లో ఫోన్ల విక్ర‌యాల్లో రెండో స్థానంలో ఉంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఏటా 220 మిలియ‌న్ ఫోన్లు విక్ర‌యిస్తుండ‌గా, ఇందులో 60 శాతం మైబైల్స్‌ను వియ‌త్నాంలో ఉత్ప‌త్తి చేస్తున్నారు. ఇక్క‌డి నుంచే ఎక్కువ‌గా అమెరికాకు ఎగుమ‌తి అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ట్రంప్ 25% టారిఫ్ బెదిరింపు శామ్‌సంగ్‌కు కంపెనీకి శ‌రాఘాతంగా మార‌నుంది. ఇది ఆ సంస్థ విక్ర‌యాల‌పై పెను ప్ర‌భావం చూపుతుంద‌ని భావిస్తున్నారు.

Donald Trump | యాపిల్ ప్లాంట్ స్థాపన క‌ష్ట‌మే..

ట్రంప్ హెచ్చరిక‌ల మేర‌కు యాపిల్ అమెరికాలో ప్లాంట్ నెల‌కొల్పాలంటే సుదీర్ఘ స‌మ‌యం ప‌ట్టొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఐఫోన్ ఉత్పత్తిని యునైటెడ్ స్టేట్స్‌కు తరలించాలంటే క‌నీసం ఒక దశాబ్దం వరకు ప‌డుతుందని వెడ్‌బుష్‌లో విశ్లేషకుడు డాన్ ఐవ్స్ ఒక పరిశోధన ప‌త్రంలో వెల్ల‌డించారు. అదే జ‌రిగితే ఐఫోన్ల ధర $3,500 చేరే అవ‌కాశ‌ముంద‌ని తెలిపారు. ఐఫోన్ ప్రస్తుతం దాదాపు $1,200ల‌కే ల‌భిస్తోంది.