Preity Zinta
Preity Zinta | పంజాబ్ కింగ్స్ జ‌ట్టు యాజ‌మాన్యంలో లుక‌లుక‌లు.. కోర్టు మెట్లెక్కిన ప్రీతి జింటా

అక్షరటుడే, వెబ్​డెస్క్: Preity Zinta | ఐపీఎల్‌(IPL)లో పాల్గొంటున్న పంజాబ్‌ కింగ్స్‌(Punjab Kings) జట్టు మంచి ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తోంది. తొలిసారి ప్లేఆఫ్స్​కు చేరింది. అయితే ఆ జ‌ట్టులో అంతర్గత వివాదం చెలరేగింది. జట్టు సహ యజమాని, బాలీవుడ్‌ నటి అయిన ప్రీతి జింటా కోర్టును ఆశ్రయించారు. జట్టుకు చెందిన మరో ఇద్దరు సహ డైరెక్టర్లు అయిన మోహిత్‌ బుర్మాన్‌, నెస్‌ వాడియాలపై ఆమె చండీగఢ్‌ కోర్టు(Chandigarh Court)లో కేసు దాఖలు చేశారు. కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా సమావేశాన్ని నిర్వహించారనే ఆరోపణలతో ఆమె పిటిషన్ వేసిన‌ట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 21న జరిగిన ఈజీఎంలో మునీష్ ఖన్నా(Munish Khanna)ను కొత్త డైరెక్టర్‌గా నియమించారు. అయితే, ఈ సమావేశ నిర్వహణలో కంపెనీల చట్టం, 2013లోని నిబంధనలను, ఇతర సెక్రటేరియల్ నియమాలను పాటించ‌లేదంటూ ప్రీతి త‌న పిటిష‌న్‌లో పేర్కొంది.

Preity Zinta | ప్రీతి పిటిష‌న్..

సమావేశం గురించి తనకు ఏప్రిల్ 10న ఈమెయిల్ ద్వారా సమాచారం అందినప్పటికీ, తాను లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోలేదని ఆమె పేర్కొన్నారు. మోహిత్‌ బర్మాన్‌ ఈ సమావేశాన్ని నెస్‌ వాడియా మద్దతుతో నిర్వహించారని ఆరోపించారు. తాను, మరో డైరెక్టర్‌ కరణ్‌పాల్‌ Karan Pal ఈ సమావేశానికి హాజరయ్యారని, అయినప్పటికీ ఈ సమావేశం చట్టబద్ధత చెల్లదని ప్రకటించాలని కోర్టును ఆమె కోరారు. ఏప్రిల్ 21న జరిగిన సమావేశాన్ని, అందులో తీసుకున్న నిర్ణయాలను రద్దు చేయాలని ప్రీతి జింటా కోర్టును అభ్యర్థించారు. మునీష్ ఖన్నా డైరెక్టర్‌గా వ్యవహరించకుండా నిరోధించాలని కూడా ఆమె కోరారు. అంతేకాకుండా, ఈ కేసు పరిష్కారమయ్యే వరకు తాను, కరణ్ పాల్ హాజరు లేకుండా, మునీష్ ఖన్నా ప్రమేయం లేకుండా కంపెనీ ఎలాంటి బోర్డు లేదా సర్వసభ్య సమావేశాలు నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇంత వివాదం నడుస్తున్నా కూడా ప్రీతి జింటా Preity Zinta పంజాబ్‌ కింగ్స్‌ జట్టుకు ప్రోత్సాహం అందించేందుకు స్టేడియానికి వస్తూ.. ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూనే ఉంది. శ్రేయస్‌ అయ్యర్‌(Shreys Iyer) నేతృత్వంలోని పంజాబ్‌ కింగ్స్‌ జట్టు ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోంది. 11 ఏళ్ల విరామం తర్వాత జట్టు ప్లేఆఫ్స్‌(Playoffs) దశకు చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాప్‌ 2లో స్థానం దక్కించుకునే దిశగా దూసుకెళ్తోంది.