అక్షరటుడే, వెబ్‌డెస్క్: BRS | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Mlc Kavitha) తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖాస్త్రం సంధించడంపై కాంగ్రెస్ తనదైన శైలిలో స్పందించింది. కవిత లేఖతో బీఆర్ఎస్ బలహీనపడినట్లు అర్థమవుతోందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) వ్యాఖ్యానించారు. పదేళ్లలో సామాజిక తెలంగాణ తేలేకపోయామన్న కవిత వ్యాఖ్యలు కేసీఆర్ పాలనను అభిశంసించడమేనని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో పదేళ్లు సరిగా పాలన చేయలేదని కవిత ఒప్పుకున్నట్లేనన్నారు. ఇంటి గుట్టు బయటకు రాకుండా కేటీఆర్(KTR) తన బావ హరీశ్‌రావు(Harish rao) ఇంటికెళ్లారని తెలిపారు. కవిత ఒక్కరే ఈ లేఖ రాసినట్లుగా లేదని, సీనియర్స్ అందరూ కలిసి లేఖ రాసినట్లుగా ఉందని చెప్పారు.
BRS | బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే..
తాము మొదటి నుంచి చెబుతున్నట్లు బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) ఒక్కటే అన్న అనుమానం గులాబీ శ్రేణుల్లోనూ ఉందని చామల తెలిపారు. రెండు పార్టీలు ఒక్కటేనన్న అనుమానం వస్తోందని కవిత కూడా అన్నారని, దీనిపై బీఆర్ఎస్ ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్(KTR)కి పార్టీ పట్టాభిషేకం చేయడంతో కవిత, హరీశ్‌రావులలో ఆందోళన కనిపిస్తోందన్నారు. కవితని జైలుపాలు చేసిన బీజేపీ గురించి కేసీఆర్ కేవలం ఒక్క నిమిషం కూడా మాట్లాడకపోవటంపై ఆమెలో గూడు కట్టుకున్న ఆవేదన లేఖలో కనపడుతోందన్నారు. కవిత ఆత్మగౌరవం దెబ్బతిన్నట్లు కనిపిస్తోందని తెలిపారు.
BRS | కేటీఆర్ వ్యాఖ్యలు విడ్డూరం
కాళేశ్వరం(Kaleshwaram) బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ అని, మాజీ సీఎం కేసీఆర్ అంత పెద్ద ఇంజినీర్ దేశంలో లేరని కేటీఆర్ అనడం విడ్డూరంగా ఉందని చామల విమర్శించారు. భూగోళంలో ఇలాంటి ప్రాజెక్ట్ లేదని కేటీఆర్ గొప్పలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru Rangareddy Project)పై నాగం జనార్ధన్ రెడ్డి వేసిన కేసులో ఇచ్చిన తీర్పును కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project)కు కేటీఆర్ ముడిపెడుతున్నారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్(Palamuru Rangareddy Project)లో అవినీతి జరిగిందని సీబీఐ విచారణ చేయాలని నాగం గతంలో అడిగారని గుర్తుచేశారు. ఇప్పుడు నాగం జనార్దన్‌రెడ్డి(Nagam Janardhan Reddy) బీఆర్ఎస్‌లోనే ఉన్నారన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. నిజాం నవాబు చార్మినార్(Charminar) కడితే, కేసీఆర్ కాళేశ్వరం కట్టారని కేటీఆర్ చెబుతున్నారని.. అలాంటప్పుడు నాగం జనార్దన్ రెడ్డి కేసు ఎందుకు వేశారో ఆయన్ని అడిగితే తెలుస్తోందని చెప్పారు. కేసీఆర్‌కి మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ కట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. కేసీఆర్ బ్రహ్మాండగా పాలన చేశారని తెలంగాణ ప్రజలు చెప్పాలి కానీ బీఆర్ఎస్ నేతలే చెబితే ఎలా అని ప్రశ్నించారు. తమ నాయకుడు రాహుల్‌గాంధీ(Rahul gandhi) గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలిస్తానంటే కేసీఆర్ ప్రభుత్వం అనుమతించలేదని, 10 కిలోమీటర్ల దూరం వరకు పోలీసులను కాపలాపెట్టారని గుర్తుచేశారు. కేటీఆర్ అపరిచితుడు సినిమాలో రెమోలాగా వ్యవహారిస్తున్నారని సెటైర్లు వేశారు. మిస్ వరల్డ్ పోటీలను తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని .. కానీ ఆ పోటీలను చూసి కేటీఆర్ అసూయ పడుతున్నారని విమర్శించారు.