అక్షరటుడే, కామారెడ్డి: Mla Madan Mohan Rao | చెక్కు చెదరకుండా ఉండేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్ట్ నిర్మిస్తామని ఎమ్మెల్యే మదన్మోహన్రావు (MLA Madan Mohan Rao) అన్నారు. సదాశివనగర్ మండలం భూంపల్లి రిజర్వాయర్(Bhumpalli Reservoir) పనులను గురువారం ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా గెలిచిన 14 రోజుల్లోనే ఇరిగేషన్ అధికారులతో కాళేశ్వరం(Kaleshwaram) పనులపై రివ్యూ చేశానన్నారు. ప్రాజెక్టు పనులపై రెండుసార్లు అసెంబ్లీలో ప్రస్తావించానని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులకు బీఆర్ఎస్ హయాంలో తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. పోచారం ప్రాజెక్టు మట్టితో కూడుకుపోయిందని, దీనిపై మంత్రితో మాట్లాడుతున్నానన్నారు.
త్వరలో 5వేల మంది రైతులతో సీఎంను కలిసి ఫైనాన్స్ అప్రూవల్ తెస్తానని పేర్కొన్నారు. ప్యాకేజీ 22 పనులకు సంబంధించి రూ.23 కోట్ల నిధులను షబ్బీర్ అలీ మంజూరు చేయించారా..? మీరు చేయించారా..? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఇది రాజకీయం కాదన్నారు. తన నియోజకవర్గంలో మెజారిటీ రైతులకు లాభం చేకూర్చే ప్రాజెక్టు అని పేర్కొన్నారు. రూ.23 కోట్ల విడుదల కోసం 2024 జులై 1న మంత్రి ఉత్తమ్ కుమార్కు వివరాలతో కూడిన వినతిపత్రం అందించానన్నారు. ఫలితంగానే నిధులు మంజూరయ్యాయని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా 3వేల ఎకరాలు సేకరించాల్సి ఉందని చెప్పారు.