Epfo
Epfo | ఈపీఎఫ్ చందాదారుల‌కు గుడ్ న్యూస్‌.. ఏటీఎం, యూపీఐ ద్వారా డ్రా చేసుకునే అవ‌కాశం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Epfo | ప్రాఫిడెంట్ ఫండ్(Provident Fund) చందాదారుల‌కు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) గుడ్‌న్యూస్ చెప్పింది. పీఎఫ్ డ‌బ్బులు(PF money) డ్రా చేసుకోవ‌డానికి గ‌తంలోలా నెల‌ల త‌ర‌బ‌డి ఎదురుచూసే క‌ష్టాల‌కు చెక్ పెట్టింది. ఇకపై పీఎఫ్ డబ్బులను ఏటీఎం ద్వారా లేదా యూపీఐ ద్వారా కూడా సులభంగా డ్రా చేసుకునే అవ‌కాశం క‌ల్చించ‌నుంది. ఈపీఎఫ్​వో తీసుకున్న ఈ నిర్ణ‌యం కోట్లాది ఖాతాదారులకు ఊరటనివ్వ‌నుంది. ఈ కొత్త ఫీచర్ త్వరలో అమల్లోకి రానుందని ఈపీఎఫ్ వో వెల్ల‌డించింది. త‌ద్వారా చందాదారుల ఎదురుచూపుల‌కు తెర ప‌డుతుంద‌ని తెలిపింది.

Epfo | ఈపీఎఫ్​వో ప్రత్యేక సేవలు

ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేసే సంస్థే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(Employees’ Provident Fund Institution). ఉద్యోగుల పేర్లతో ఖాతాలు తెరిచి, వారి నెలవారీ జీతం నుంచి కొంత మొత్తాన్ని పీఎఫ్ ఖాతా(PF account)లో జమ చేస్తారు. ఉద్యోగులు తమ అవసరాల కోసం ఈ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. సాధారణంగా పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకోవాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ధ్రువీకరణ ప్రక్రియ తర్వాత 2 నుంచి 3 రోజుల్లో డబ్బులు ఖాతాదారు బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతాయి. ఈ మూడు రోజుల నిరీక్షణ సమయాన్ని తగ్గించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం యోచించింది. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేయాల‌న్న ఉద్దేశంతోనే కొత్త సేవ‌లు అందుబాటులోకి తీసుకురానుంది.

Epfo | డ్రా చేయ‌డం ఇక సులువు

పీఎఫ్ డబ్బులను తీసుకునేందుకు జ‌రుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు కేంద్రం చ‌ర్య‌లు చేప‌ట్టింది. అందులో భాగంగానే యూపీఐ(UPI), ఏటీఎం(ATM) ద్వారా విత్‌డ్రా చేసుకునే అవ‌కాశం క‌ల్పించింది. అయితే ఎప్ప‌టి నుంచి ఇది అమ‌లులోకి వ‌స్తుంద‌నేది మాత్రం వెల్ల‌డించలేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ కొత్త విధానం ఈ జూన్ నుంచి అమల్లోకి రానున్న‌ట్లు తెలిసింది. ఈ నూత‌న విధానం అమల్లోకి వస్తే, దాదాపు 7.5 కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యుల(EPFO members)కు ప్రయోజనం చేకూరనుంది. ఈ కొత్త సదుపాయం ద్వారా పీఎఫ్ ఖాతాదారులు(PF account holders) తమ డబ్బును మరింత వేగంగా, సులభంగా పొందే అవకాశం లభిస్తుంది.