అక్షరటుడే, వెబ్‌డెస్క్: Moody’s | అమెరికా(America) విధించే సుంకాలను తట్టుకుని ముందుకు సాగే శక్తి భారత్(Bharath)కు ఉందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్(Moody’s) పేర్కొంది. తక్కువ ఎగుమతి(Low exports) ఆధారిత దేశం కావడంతోపాటు ప్రభుత్వం దేశీయ ఆర్థిక వృద్ధికి తీసుకుంటున్న చర్యలే దీనికి కారణమని పేర్కొంది. భారత్‌లో తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం(Central government) చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.. ఇందులో భాగంగా మేకిన్ ఇండియా(Make in India) నినాదంతో ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ(RBI) సైతం చర్యలు తీసుకుంటోంది. మార్కెట్‌లో లిక్విడిటీని పెంచింది. ఇదే సమయంలో ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తోంది.
ఈ నేపథ్యంలో అమెరికా సుంకాల విషయంలో తాజాగా మూడీస్(Moody’s) సంస్థ స్పందించింది. యూఎస్ రెసిప్రోకల్ టారిఫ్స్(Reciprocal tariffs)ను తట్టుకునే విషయంలో ఇతర అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత్ మెరుగైన స్థితిలో ఉందని పేర్కొంది. ఇతర దేశాలపై తక్కువగా ఆధారపడడం, బలమైన అంతర్గత వృద్ధి, దేశీయ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడం వంటి కారణాలతో భారత్ పరిస్థితి మెరుగ్గా ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. జియో పొలిటికల్ టెన్షన్స్(Geo political tensions) విషయంలోనూ భారత్ వృద్ధిపైకన్నా పాకిస్థాన్‌పైనే ఎక్కువ ప్రభావం ఉంటుందని పేర్కొంది. సరిహద్దు ఉద్రిక్తతలు ఎలా ఉన్నా భారతదేశ ఆర్థిక కార్యకలాపాలకు పెద్దగా అంతరాయం ఏర్పడకపోవచ్చని చెప్పింది. వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తిలో ఎక్కువ భాగం ఉత్పత్తి చేసే ప్రాంతాలు భౌగోళిక సంఘర్షణ ప్రాంతానికి దూరంగా ఉండడంతోపాటు పాక్(Pak)తో ఆర్థిక సంబంధాలు కనీస స్థాయిలో ఉండడమే ఇందుకు కారణమన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. అయితే రక్షణ వ్యయాలు పెరగడం మాత్రం ప్రభావం చూపవచ్చని తెలిపింది.
భారత ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై చేస్తున్న వ్యయం జీడీపీ(GDP) వృద్ధికి మద్దతు ఇస్తోంది. ఇటీవల ఇన్‌కం ట్యాక్స్ పరిధిని మార్చడంతో ప్రజల వినియోగ సామర్థ్యాన్ని పెంచుతాయి. ఈ నేపథ్యంలో అమెరికా సుంకాలు, ప్రపంచ వాణిజ్య అనిశ్చిత పరిస్థితుల ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవడంలో భారత్ మెరుగైన స్థితిలో ఉందన్న అభిప్రాయాన్ని మూడీస్ వ్యక్తం చేసింది.