అక్షరటుడే, వెబ్‌డెస్క్: check BP with smartphone : మన ఆరోగ్య స్థితిని గుర్తించడంలో రక్త ప్రసరణ కీలకంగా వ్యవహరిస్తుంది. బీపీ(Blood pressure) పెరిగినా, తగ్గినా అనారోగ్యం వెంటాడుతుంటుంది. అందుకే బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవాలని డాక్లర్లు సూచిస్తారు. గుండె సహా కీలక అవయవాల ఆరోగ్యం కాపాడుకునేందుకు బీపీని నియంత్రించుకోవడం ఎంతో అవసరం.
అయితే, బీపీని కచ్చితంగా అంచనా వేయాలంటే వైద్య సిబ్బంది సాయం కావాలి. అయితే, వారి అవసరం లేకుండా బీపీ చెక్ చేసుకునే అవకాశముందా? ఫోన్‌తో రక్త ప్రసరణ చెక్ చేసుకునే చాన్స్ ఉందా? ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉండే యాప్స్‌తో బీపీ చెక్ చేసుకోవచ్చా? అనే సందేహాలు తీర్చే ఈ కథనం మీకోసం..
check BP with smartphone : బీపీ పరీక్షతో ప్రమాదాలకు చెక్..
రక్త ప్రసరణను తరచూ చెక్ చేసుకోవాలి. తద్వారా ప్రమాదాలను నివారించుకోవచ్చు. రక్తనాళాల గోడపై రక్తం వల్ల కలిగే ఒత్తిడినే బీపీ అంటారు. బీపీ తగ్గితే తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. ఒక్కోసారి స్పృహ తప్పి పడిపోయే ప్రమాదం ఉంది.
అయితే, హై బీపీతో మాత్రం ఇంతకంటే ఎక్కువ సమస్యలే వస్తాయి. బీపీ పెరిగి గుండె కండరాలు దెబ్బతింటాయి. కిడ్నీలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే, క్రమం తప్పకుండా బీపీ చెక్ చేసుకుంటూ ఉంటే ప్రమాదాలను ముందుగానే పసిగట్టి నివారణ చర్యలు తీసుకోవచ్చు.
check BP with smartphone : స్మార్ట్ ఫోన్‌తో చెక్ చేయొచ్చు.. కానీ..
చాలా మంది స్మార్ట్ ఫోన్‌తో బీపీ చెక్ చేసుకుంటామని చెబుతారు. అందుకోసం అనేక యాప్స్ అందుబాటులో ఉన్నాయి. కెమెరా ఫ్లాష్, ఇతర సెన్సర్ల సాయంతో ఫొటోప్లెథిస్మోగ్రఫీ లేదా పల్స్ ట్రాన్సిట్ టైం విధానంలో బీపీ చెక్ చేసుకోవచ్చు. అయితే, కేవలం 25 శాతం నుంచి 50 శాతం మాత్రమే కచ్చితత్వమైన ఫలితాలు వస్తున్నట్లు గుర్తించారు. కానీ, యూనివర్సిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్(University of Pittsburg) శాస్త్రవేత్తలు 2024లో బీపీని కొలిచే స్మార్ట్ ఫోన్ యాప్‌ను డిజైన్ చేశారు.
ఫోన్‌లోని యాక్సెలరోమీటర్, కెమెరా, టచ్ సెన్సార్ల సమాచారం ఆధారంగా ఈ యాప్ బీపీని అంచనా వేస్తుంది. గురుత్వాకర్షణ(gravity) శక్తి, వేళ్లపై ఉండే ఒత్తిడి ఆధారంగా యాప్ బీపీని అంచనా వేస్తుంది. చేతులను వివిధ ఎత్తుల్లో ఉంచి స్మార్ట్ ఫోన్ టచ్ చేయమని చెబుతూ ఈ యాప్‌ను బీపీని కొలుస్తుంది. గురుత్వాకరణ శక్తి కారణంగా చేతులను ఛాతి కంటే పైకి ఎత్తినప్పుడు వేళ్లల్లో హైడ్రోస్టాటిక్ ఒత్తిడి(hydrostatic pressure) మారుతుంది. ఫోన్‌లోని యాక్సెలరోమీటర్(accelerometer) ద్వారా ఈ మార్పులను గుర్తించొచ్చు. తద్వారా బీపీని అంచనా వేయొచ్చని సదరు యూనివర్సిటీ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.