అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vande Bharat Express : రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్త చెప్పింది. త్వరలో బెంగళూరు(Bangalore) – విజయవాడ(Vijayawada) మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే(South Central Railway) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. షెడ్యూల్‌తో పాటు ప్రయాణ సమయం తొమ్మిది గంటలుగా నిర్దేశించింది. తద్వారా ప్రయాణికులకు సుమారు మూడు గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది.
ప్రతిపాదిత వందేభారత్ రైలు బెంగళూరు వెళ్లేవారితో పాటు తిరుపతి(Tirupati) వెళ్లే భక్తులకు కూడా ఉపయోగపడనుంది. ఇందులో మొత్తం 8 బోగీలు ఉంటాయి. వీటిలో 7 ఏసీ చైర్‌కార్, ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ ఉంటాయి. ఈ వందేభారత్ (20711) వారంలో మంగళవారం మినహా మిగతా ఆరు రోజులు రాకపోకలు సాగిస్తుంది.
విజయవాడలో ఉదయం 5.15 గంటలకు బయలుదేరుతుంది. తెనాలిలో ఉ. 5.39, ఒంగోలులో ఉ. 6.28, నెల్లూరులో ఉ. 7.43, తిరుపతిలో ఉ. 9.45, చిత్తూరులో ఉ. 10.27, కాట్పాడిలో ఉ. 11.13, కృష్ణరాజపురంలో మధ్యాహ్నం. 13.38, ఎస్‌ఎంవీటీ బెంగళూరు మ. 14.15 గంటలకు చేరుతుంది.
బెంగళూరు నుంచి విజయవాడ(20712)కు తిరుగు ప్రయాణంలో.. అదే రోజు బెంగళూరులో మధ్యాహ్నం 14.45 గంటలకు ప్రారంభమవుతుంది. కృష్ణరాజపురంలో మ. 14.58, కాట్పాడిలో సాయంత్రం 17.23, చిత్తూరులో సా. 17.49, తిరుపతిలో సా. 18.55, నెల్లూరులో రా. 20.18, ఒంగోలులో రా. 21.29, తెనాలిలో రా. 22.42, విజయవాడకు రా. 23.45 గంటలకు చేరుకోనుంది.
ప్రస్తుతం విజయవాడ – బెంగళూరు మధ్య మచిలీపట్నం నుంచి యశ్వంతపూర్ వెళ్లే కొండవీడు ఎక్స్‌ప్రెస్(Kondaveedu Express) అందుబాటులో ఉంది. ఇది వారానికి 3 రోజులు నడుస్తోంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు సౌలభ్యం అవుతుంది.