అక్షరటుడే, వెబ్‌డెస్క్: LIC | భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ)లో వాటాను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) సన్నాహాలు చేస్తోంది.
రానున్న రెండేళ్లలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో 6.5 శాతం వాటాను విక్రయించాలని యోచిస్తున్నట్లు బిజినెస్ స్టాండర్డ్ నివేదిక వెల్లడించింది. స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ(సెబీ) కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ (MPS) అవసరాలను తీర్చే లక్ష్యంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో (CPSE)లు వరుస వాటా అమ్మకాలను విక్రయించే క్రమంలో ఎల్ఐసీలోనూ వాటాను విక్రయించేందుకు సిద్ధమైంది.
LIC | ఎల్ఐసీలో కేంద్రానిది అత్యధిక వాటా
భారతీయ జీవిత బీమా(Indian Life Insurance) సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక వాటా ఉంది. అయితే, సెబీ మార్గదర్శకాల ప్రకారం.. పబ్లిక్ లిస్టింగ్ కంపెనీలో యాజమాన్య వాటా 75 శాతానికి మించకూడదు. అలాగే, 25 శాతం కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ ఉండాలన్నదని సెబీ నిబంధన. ఈ నేపథ్యంలోనే ఎల్ఐసీ(LIC)లో వాటా విక్రయానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది.
“చిన్న పెట్టుబడిదారులు తదనుగుణంగా సిద్ధం కావడానికి ముందస్తు నోటీసును అందిస్తూ, ఏడాది పొడవునా రెగ్యులర్, స్మాల్ ఆఫర్స్ ఫర్ సేల్ (OFS) వ్యూహాన్ని మేము అవలంభిస్తాం” అని పెట్టుబడి, పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ విభాగం కార్యదర్శి అరుణిష్ చావ్లా వెల్లడించారు. లిస్టెడ్ కంపెనీలకు కనీసం 25 శాతం పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఉండాలన్న సెబీ ఆదేశాలను ఇప్పటికే చాలా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు పాటించడం లేదు. ప్రధానంగా రక్షణ, రైల్వేలు, ఆర్థిక రంగ సంస్థలకు సంబంధించి ఇప్పటికీ.. మెజారిటీ వాటా కేంద్రం చేతుల్లోనే ఉంది. ఈ నేపథ్యంలో ఆయా సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణను వేగవంతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, వచ్చే ఏడాదిలోపు పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు కార్యదర్శి చావ్లా వివరించారు.
LIC | బ్యాంకుల్లో వాటాల విక్రయం..
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (Bank of Maharashtra), యుకో బ్యాంక్ (UCO Bank) వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు 25 శాతం పబ్లిక్ షేర్ హోల్డింగ్ ప్రమాణాన్ని చేరుకోవడానికి ఆగస్టు 2026 వరకు గడువు ఉంది. ఇంతలో, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) మే 16, 2027 నాటికి ఎల్ఐసీ తన పబ్లిక్ షేర్ హోల్డింగ్‌ను 10 శాతానికి పెంచడానికి అనుమతించింది. 2022 మే మాసంలో ఎల్ఐసీ షేర్ మార్కెట్‌లో లిస్టింగ్ కాగా, అప్పట్లో ప్రభుత్వం ప్రారంభ 3.5 శాతం వాటాను విక్రయించింది.
సెబీ ఆదేశాల మేరకు మరో 6.5 శాతం వాటా విక్రయానికి చర్యలు చేపట్టింది. మార్కెట్ లిక్విడిటీ(Market Liquidity)ని కల్పించడానికి, చిన్న పెట్టుబడిదారులకు పాల్గొనడానికి న్యాయమైన అవకాశం ఉందని నిర్ధారించడానికి ఎల్ఐసీ షేర్ల (LIC Shares) అమ్మకం చిన్న భాగాలలో నిర్వహించబడుతుందని చావ్లా వివరించారు. ప్రస్తుత మార్కెట్ ధర ఆధారంగా, ఎల్ఐసీలో 6.5 శాతం వాటాను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.35,256 కోట్లు సమకూరే అవకాశముందని అంచనా వేస్తున్నారు.