అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Rohit Sharma | వాంఖడే మైదానం(Wankhede Ground)లో తన పేరిట స్టాండ్ ఏర్పాటు చేస్తారని అస్సలు ఊహించలేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. గొప్ప ఆటగాళ్లు, రాజకీయ నేతల స్టాండ్స్ మధ్య తన పేరు ఉండటం మాటల్లో చెప్పలేని అనుభూతి అని తెలిపాడు. రోహిత్ శర్మను ముంబై క్రికెట్ అసోసియేషన్(Mumbai Cricket Association)ఘనంగా సత్కరించింది. వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ పేరిట ఓ స్టాండ్ ఏర్పాటు చేసింది.ఈ స్టాండ్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి రోహిత్ శర్మ తల్లిదండ్రులు పూర్ణిమా-గురునాథ్ శర్మలు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రోహిత్ శర్మ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.
వాంఖడే స్టేడియంలో తన పేరు పెడుతారని అస్సలు ఊహించలేదన్నాడు. చిన్నప్పుడు ముంబై, టీమిండియా తరఫున ఆడాలని కోరుకున్నప్పుడు.. ఇలాంటి గౌరవం దక్కుతుందని ఆలోచించలేదన్నాడు. ఆటలో సాధించిన మైలురాళ్ల కంటే ఇది ఎంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చాడు. వాంఖడే స్టేడియంలో తనకు ఎన్నో గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పిన రోహిత్(Rohit).. తన పేరిట స్టాండ్ ఏర్పాటు చేసి గొప్ప గౌరవాన్ని అందించిన ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. తన కుటుంబ సభ్యుల త్యాగాల వల్లే ఈ గౌరవం దక్కిందన్నాడు.
భవిష్యత్తులో టీమిండియా(Team India) తరఫున ఇక మ్యాచ్ ఆడినప్పుడు తనకు ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుందని చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ ప్రసంగంతో అతని సతీమణి రితికా సజ్దే తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతమైంది. వాంఖడే స్టేడియంలో ఇప్పటికే సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వినోద్ మన్కడ్, దిలీప్ వెంగ్‌సర్కార్ పేరిట స్టాండ్స్ ఉండగా.. తాజాగా రోహిత్ శర్మతో పాటు శరద్ పవార్, అజిత్ వాడేకర్ పేరిట స్టాండ్లను ఆవిష్కరించారు.