అక్షరటుడే, వెబ్డెస్క్ : Bichkunda | వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో కొందరు అక్రమాలకు పాల్పడుతున్న చర్యలు తీసుకునే వారే కరువయ్యారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథులే లేకుండా పోయారు. ఇందుకు బిచ్కుంద మార్కెట్ కమిటీలో జరిగిన అక్రమమే ఉదాహరణ. బిచ్కుందకు చెందిన ఓ ట్రేడర్ 2023–24కు సంబంధించి రూ.80వేలకు పైగా మార్కెట్ ఫీజును బిచ్కుంద ఎస్బీఐలో నెఫ్ట్ ద్వారా మార్కెట్ కమిటీ ఖాతాలో ఏడాది క్రితం జమ చేశాడు. అయితే సదరు ఫీజు చెల్లింపునకు సంబంధించిన రశీదు ఇవ్వలేదని ట్రేడర్ వాపోయాడు. ఈ విషయమై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే వారు కరువయ్యారు. కార్యదర్శి వద్దకు వెళ్లి రశీదు ఇవ్వాలని కోరాగా.. డబ్బుల చెల్లింపు విషయం తనకు తెలియదని చెబుతున్నారని బాధితుడు పేర్కొన్నాడు.
ఆ డబ్బులను అప్పటి కార్యదర్శి డ్రా చేసుకున్నాడని ప్రస్తుత కార్యదర్శి చెప్పారని తెలిపాడు. ఆయన డబ్బులు సొంతానికి వాడుకోవడంతో రశీదు ఇవ్వలేకపోతున్నట్లు చెప్పారన్నాడు. దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. అయినా స్పందన లేకపోవడంతో గత నెల 15 వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు minister tummala nageswara rao లేఖ ద్వారా ఫిర్యాదు చేశాడు. అయినా అధికారులు ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. సదరు కార్యదర్శి నుంచి ఆ డబ్బులు రికవరీ చేసి, ఏఎంసీ ఖాతాలో జమ చేయాలని బాధితుడు కోరాడు.