అక్షరటుడే, వెబ్డెస్క్ : Konda Surekha | కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)లో కమీషన్లు లేనిదే ఫైళ్లు కదలడం లేదా? ముడుపులు ఇవ్వనిదే పనులు ముందుకు సాగడం లేదా? పైసలు తీసుకోనిదే మంత్రులు ఫైళ్లపై సంతకాలు పెట్టడం లేదా? అనుమతులు ఇవ్వడం లేదా? అసలు మంత్రివర్గంలో అంత మంచిగున్నదా? లేక ఆధిపత్య పోరు కొనసాగుతున్నదా? ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న చర్చ ఇదే. మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలో పెట్టాయి. కొందరు మంత్రులు డబ్బులు తీసుకుని ఫైళ్లపై సంతకాలు పెడుతున్నారని ఆమె యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం లేపాయి. ఇప్పటికే హామీల అమలులో విఫలమై, ఆదాయం లేదని, దివాళా తీశామని ప్రభుత్వం చేతులెత్తేయడంపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమైంది. తాజాగా కొండా వ్యాఖ్యలతో అది మరింత ఆగ్రహానికి దారి తీసింది. మరోవైపు, మంత్రి మాటలు రాజకీయ ప్రత్యర్థులకు మంచి బ్రహ్మాస్త్రంగా అందివచ్చాయి. ఇప్పటికే బీఆర్ఎస్ 30 పర్సెంట్ కమీషన్ ప్రభుత్వమని ఆరోపణలు గుప్పిస్తుండగా, అటు బీజేపీ కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని రేవంత్(Revanth) సర్కారును ఇరుకున పెట్టేందుకు యత్నిస్తోంది.
Konda Surekha | అసలేం జరుగుతోంది?
కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. ఇప్పటికీ పాలనపై సరైన పట్టురానట్టే కనిపిస్తోంది. మంత్రులు ఎవరికి వారే అన్న ధోరణితో అధికార యంత్రాంగం ఇష్టారాజ్యం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy)కి అటు ప్రత్యర్థులతో పాటు ఇటు సొంత పార్టీలోని వారితో ఇక్కట్లు తప్పడం లేదు. కష్టసమయాల్లో ఆయనకు అండగా ఉండాల్సిన సీనియర్ మంత్రులు కనీసం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మూసీ సుందరీకరణ, హైడ్రా, హెచ్‌సీయూ భూములు తదితర అంశాల్లో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నా, సర్కారు మైలేజ్ పడిపోతున్నా కనీసం స్పందించలేదు. ఇక, పదేళ్ల తర్వాత అందివచ్చిన అధికారాన్ని కొందరు మంత్రులు ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటున్నారు. ఫైళ్లు ముందుకు కదలాలన్నా, ప్రాజెక్టులకు అనుమతులు కావాలన్నా, బిల్లులు మంజూరు కావాలన్నా 20-30 శాతం పర్సంటేజీ తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశాన్ని కొండా సురేఖ యథాలాపంగా చెప్పారు.
Konda Surekha | అందుకున్న బీఆర్ఎస్, బీజేపీ..
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రంగా దొరికాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల ప్రభుత్వమని బీఆర్ఎస్, బీజేపీ వెంటనే పాత రాగం అందుకున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఎప్పటి నుంచో ప్రభుత్వంపై కమీషన్ల ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. 30 శాతం కమీషన్ సర్కారు ఇది.. డబ్బులు ఇవ్వనిదే ఫైళ్లు కదలవు, బిల్లులు రావు అని ఆరోపిస్తున్నారు. తాజాగా కొండా ఆరోపణలపై గులాబీ పార్టీ సర్కారును ఇరుకున పెట్టేందుకు యత్నించింది. ఇక బీజేపీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై విమర్శలు గుప్పించింది. ఏ మంత్రి ఎంతెంత తీసుకున్నాడో చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy).. మంత్రి కొండా సురేఖను డిమాండ్ చేశారు. కమీషన్లు తీసుకుంటున్న ప్రభుత్వం దిగిపోవాలని సూచించారు. మరోవైపు, నష్ట నివారణ చర్యలను కాంగ్రెస్ ప్రారంభించింది. రెండు వైపులా నుంచి వస్తున్న విమర్శలను కౌంటర్ చేసేందుకు ప్రత్యారోపణలు చేసినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది.
Konda Surekha | సీనియర్ పొలిటిషన్ కొండా..
మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) రాజకీయాల్లో ఎంతో సీనియర్. ఎన్నో ఉత్థాన పథనాలు చూశారామె. వరంగల్ జిల్లా రాజకీయాలకు ఎదురొడ్డి నిలబడ్డారు. ఎర్రబెల్లి వంటి ఉద్ధండులతో తలబడ్డారు. కాంగ్రెస్(Congress), వైఎస్సార్‌సీపీ(YSRCP), బీఆర్ఎస్(BRS) పార్టీల్లో పని చేసిన ఆమె దశాబ్దానికి పైగా అమాత్యురాలిగా అనుభవం కూడా ఉన్నది. అలాంటిది ఆమె.. కొందరు మంత్రులు పైసలు తీసుకుని ఫైళ్లపై సంతకాలు పెడుతున్నారని వ్యాఖ్యానించడం వెనుక బలమైన కారణమే ఉండి ఉంటుందన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)లోని ఆధిపత్య పోరును సూచిస్తోందని చెబుతున్నారు. తన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపడంతో కొండా సురేఖ ఏదో సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కొందరు మంత్రులు అన్నాను తప్పితే కాంగ్రెస్ మంత్రులని అనలేదని చెప్పుకొచ్చారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సర్కారు పరువు గంగపాలైంది.