అక్షరటుడే, వెబ్డెస్క్:Konda Surekha | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అనేక సార్లు ఆమె చేసిన వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరగ్గా తాజాగా.. ప్రభుత్వంలోని మంత్రులపైనే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రుల దగ్గర ఏ పని జరగాలన్నా.. ఏ ఫైల్ కదలాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందే అని ఆమె అన్నారు. వరంగల్ కృష్ణ కాలనీలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో రూ.5కోట్ల సీఎస్ఆర్ నిధులతో అరబిందో ఫౌండేషన్(Arabindo Foundation) ఆధ్వర్యంలో నూతన భవనం నిర్మిస్తున్నారు. ఈ భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “నా దగ్గరకు కొన్ని కంపెనీల ఫైల్స్ వస్తుంటాయి. మాములుగా మంత్రులు డబ్బులు తీసుకొని ఫైళ్లను క్లియర్ చేస్తారు. నేను అలా కాకుండా.. సమాజ సేవ చేయమంటాను. నాకు నయా పైసా అవసరం లేదని, కాలేజీ అభివృద్ధి చేయాలని” చెప్పినట్లు మంత్రి తెలిపారు. తాజాగా ఆమె వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.
Konda Surekha | నా వ్యాఖ్యలను వక్రీకరించారు
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో ఆమె స్పందించారు. తాను బీఆర్ఎస్(BRS) హయాంలో పనులు చేయాలంటే అప్పటి మంత్రులు డబ్బులు తీసుకునేవారు అని చెప్పానని తెలిపారు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
Konda Surekha | స్పందించిన కేటీఆర్
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) స్పందించారు. ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నారని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ కమీషన్ సర్కార్ నడుపుతోందని ఆరోపించారు. కమీషన్లు తీసుకోకుండా మంత్రులు సంతకాలు చేయరన్నారు. 30 శాతం కమీషన్లతో ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. కమీషన్లు తీసుకున్న వారి పేర్లను మంత్రి బయటపెట్టాలని కేటీఆర్(KTR) డిమాండ్ చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై విచారణకు ఆదేశించగలరా అని ప్రశ్నించారు.