అక్షరటుడే, వెబ్‌డెస్క్: Footi Kothi building : మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని ఇందౌర్‌లో ఓ భారీ భవనం ఉంది. దీనిని ‘ఫూటీ కోఠి’గా పిలుస్తారు. పేరుకు తగ్గట్టే ఈ భవనాన్ని అసంపూర్తిగా నిర్మించారు. హోల్కర్ రాజవంశీకుల కాలంలో దీనిని నిర్మించారు. ఈ భవనంలో 365 గదులున్నా ఏ ఒక్క దానికి కూడా పైకప్పు ఉండదు. శాపగ్రస్త భవనంగా దీనిని పేర్కొంటారు. అందుకే పైకప్పుకు నోచుకోలేదని చెబుతుంటారు.
Footi Kothi building : సైన్యం కోసం..

19వ శతాబ్దం చివరలో మహారాజా శివాజీ రావు హోల్కర్(Maharaja Shivaji Rao Holkar) ఫూటీ కోఠి నిర్మించారు. ఇందౌర్ నగరం పశ్చిమ ప్రాంతంలో ఈ భవనం ఉంది. ప్రాచీన భారతీయ, బ్రిటీష్ శైలుల కలయికతో ఉన్న ఈ నిర్మాణం చూడముచ్చటగా ఉంటుంది. హోల్కర్ సైనికులు, బలగాలను సురక్షితంగా ఉంచేందుకు ఈ ఫూటీ కోఠి నిర్మించారని చెబుతుంటారు.
ఫూటీ కోఠి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇటీవలి కాలంలో 18 ఆలయాలు నిర్మించారు. ప్రస్తుతం వీటి నిర్వహణను సర్వజన్ కళ్యాణ్ సమితి చూసుకుంటోంది. అయినా ఈ భవనంలోని చాలాభాగం ఇంకా నిర్జనంగా ఉంది.
Footi Kothi building : పైకప్పు ఎందుకు నిర్మించలేదంటే..

ఫూటీ కోఠి నిర్మాణంలో నల్ల రాయి, సున్నం, ఇతర పురాతన నిర్మాణ సామగ్రి వినియోగించారు. ఇక పైకప్పు విషయానికి వస్తే.. ఎలాంటి ఆధారం లేకుండా ఫూటీ కోఠి పైన వేలాడే పైకప్పు నిర్మించాలని తలచారు. అయితే ప్రణాళిక ప్రకారం నిర్మాణ పనులు తలపెట్టాక.. ఈ సమాచారం కాస్త బ్రిటీష్ పాలకులకు చేరడంతో, వారు వచ్చి పనులను అడ్డుకున్నారట. అంతటితో ఆగకుండా కోఠిలోని కొంత భాగం ధ్వంసం చేశారట. అందువల్లే గత 200 ఏళ్లుగా ఫూటీ కోఠి అసంపూర్తిగా ఉంటోంది.
Footi Kothi building : కొంత భాగం భూగర్భంలోనే..
ఫూటీ కోఠి రెండు అంతస్తుల్లో ఉంటుంది. కింది గదుల్లో ఎక్కువగా భూగర్భంలోనే ఉన్నాయి. సైనికులు దాక్కునేందుకు ఇందులోనే భూగర్భ గుహ ఉంది. ఈ భవనం కింది భాగం చివరన దుర్గామాత ఆలయం ఉంది. చిమ్మచీకటిగా ఉండడంతో ఈ ఆలయంలోకి ఎవరైనా వెళ్లాలంటే జంకుతారు.