అక్షరటుడే నిజాంసాగర్: Nizamsagar Project | భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య తన కొడుకుతో నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి(Sangareddy) జిల్లా నిజాంపేట్ (Nizampet) మండలం మునిగేపల్లి గ్రామానికి చెందిన దార సాయిలు, ప్రమీల భార్యాభర్తలు. వారికి ఇద్దరు పిల్లలు అక్షయ్, నిహారిక ఉన్నారు. అయితే 20 రోజుల క్రితం అప్పుల బాధతో సాయిలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పటినుంచి మనస్థాపంతో ఉన్న ప్రమీల(30) తన కుమారుడు అక్షయ్(8)ను తీసుకుని బ్యాంక్‌కు వెళ్లి వస్తానని చెప్పి నిజాంసాగర్‌కు వచ్చారు. అనంతరం ప్రాజెక్ట్‌లోని 20వ గేట్ వద్ద నుంచి దూకారు. గురువారం ఉదయం వారిరువురి మృతదేహాలను చూసి జాలర్లు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీయించి వారి కుటుంబీకులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు.