Travel-bookings
Boycott Turkey | ట‌ర్కీ, అజార్‌బైజాన్‌ల‌కు షాక్‌..ట్రావెలింగ్ బుకింగ్‌ల నిలిపివేత‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Boycott Turkey | భార‌త్‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ట‌ర్కీ(Turkey), అజార్‌బైజాన్(Azerbaijan) దేశాల‌కు ఊహించ‌ని రీతిలో సెగ త‌గులుతోంది. ఇప్ప‌టికే బ్యాన్ ట‌ర్కీ నినాదం ట్రెండింగ్‌లో ఉండ‌గా, తాజాగా ట్రావెలింగ్‌లోనూ ఆ దేశానికి గ‌ట్టి దెబ్బ తగిలింది. పాకిస్తాన్‌(Pakistan)కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన టర్కీ నుంచి వ‌చ్చే ఆపిల్స్ స‌హా ఇత‌ర వ‌స్తువుల‌ను దిగుమ‌తి చేసుకోమ‌ని ఇప్ప‌టికే వ్యాపార‌, వాణిజ్య సంస్థ‌లు ప్ర‌క‌టించాయి. తాజాగా ట‌ర్కీతో పాటు అజార్‌బైజాన్‌కు బుకింగ్‌లు నిలిపి వేస్తున్న‌ట్లు భారతదేశంలోని ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌లు ప్ర‌క‌టించాయి. మేక్‌మై ట్రిప్‌, ఫ్లిప్‌కార్ట్ వంటివి ఈ నిర్ణ‌యం తీసుకున్నాయి. భార‌త సార్వ‌భౌమ‌త్వానికి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించే దేశాల‌కు త‌మ సేవ‌లు అందించ‌బోమ‌ని పేర్కొన్నాయి. దీంతో ఆయా దేశాలు దిగి వ‌స్తున్నాయి.

Boycott Turkey | భార‌త విశాల ప్ర‌యోజ‌నాల కోసం..

భారతదేశ జాతీయ ప్రయోజనాలతో పాటు సార్వభౌమత్వానికి సంఘీభావంగా టర్కీ, అజర్‌బైజాన్‌లకు అన్ని విమాన, హోటల్, హాలిడే ప్యాకేజీ బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ట్రావెల్(Flipkart Travel), క్లియర్‌ట్రిప్(Cleartrip).. ప్ర‌క‌టించాయి. “మా వైఖరి స్పష్టంగా ఉంది. మా విధేయత, అచంచలమైనది. భారతదేశం ముందుంది” అని పేర్కొన్నాయి. “మా దేశంతో సంఘీభావంగా, మా సాయుధ దళాల పట్ల లోతైన గౌరవంతో, మేము ఈ భావనను గట్టిగా సమర్ధిస్తున్నాము. అజర్‌బైజాన్, టర్కీకి అన్ని అనవసర ప్రయాణాలకు వ్యతిరేకంగా అందరికీ సలహా ఇస్తున్నాము. ఈ రెండు గమ్యస్థానాలకు పర్యాటకాన్ని నిరుత్సాహపరిచేందుకు మేము ఇప్పటికే మా ప్లాట్‌ఫామ్‌లో అన్ని ప్రమోషన్‌లు మరియు ఆఫర్‌లను నిలిపివేశామని” మేక్‌మైట్రిప్(MakeMyTrip) మే 14న ఒక ప్రకటనలో పేర్కొంది. మ‌రోవైపు, టర్కీ, అజర్‌బైజాన్‌లకు ప్రయాణించవద్దని ఈజ్‌మైట్రిప్ ప్రయాణికులకు సూచించింది. “భారత సాయుధ దళాలు చైనా యాజమాన్యంలోని ప్లాట్‌ఫామ్ ద్వారా డిస్కౌంట్ టిక్కెట్లను బుక్ చేసుకుంటాయి, డిఫెన్స్ ID, రూట్ & తేదీని నమోదు చేస్తాయి. మన సైనికులు ఎక్కడ ఎగురుతున్నారో మన శత్రువులకు తెలుసు” అని ఈజ్‌మైట్రిప్ ఛైర్మన్ నిశాంత్ పిట్టి(EaseMyTrip Chairman Nishant Pitti) ‘X’లో పేర్కొన్నారు.