అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BCCI | టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ(BCCI) శుభవార్త చెప్పింది. టెస్ట్‌తో పాటు టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరి ఆటగాళ్లకు ఏ ప్లస్ కాంట్రాక్ట్ కొనసాగుతుందని బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా(BCCI Secretary Devajit Saikia) స్పష్టం చేశారు. భారత క్రికెట్‌లో భాగమైన ఈ ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటించినా.. ఏ ప్లస్ కాంట్రాక్ట్ సౌకర్యాలు కొనసాగుతాయని తెలిపారు.
బీసీసీఐ రూల్స్ ప్రకారం రెగ్యులర్‌గా మూడు ఫార్మాట్లు ఆడే ఆటగాళ్లకు మాత్రమే ఏ ప్లస్ కాంట్రాక్ట్ ఇస్తారు. ఈ కాంట్రాక్ట్ కింద ఆటగాళ్లకు ఏడాదికి రూ. 7 కోట్ల వేతనం అందుతుంది. మ్యాచ్ ఫీజులు, ఇతర అలవెన్స్‌లు అదనం. మరోవైపు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఘన వీడ్కోలు పలికేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలోని తొలి టెస్ట్‌కు ఈ ఇద్దరి ఆటగాళ్లను ఆహ్వానించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌లో భాగంగా జూన్ 20న లీడ్స్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం కానుంది.
అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు రోహిత్, కోహ్లీలకు గార్డ్ ఆఫ్ హానర్(Guard of Honour) ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారత క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా వారికి గౌరవ వందన కార్యక్రమం ఏర్పాటు చేయాలనే యోచనలో బీసీసీఐ(BCCI) ఉన్నట్లు ఓ అధికారి మీడియాకు తెలిపారు. కోహ్లీ, రోహిత్ శర్మలను ఇంగ్లండ్ పర్యటనలోని తొలి టెస్ట్‌కు హాజరవ్వాలని ప్రత్యేకంగా కోరనుందని చెప్పారు. ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు ఫేర్‌వెల్ మ్యాచ్ ఏర్పాటు చేసి ఘనంగా వీడ్కోలు పలకాలని అభిమానులు, మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.