అక్షరటుడే, వెబ్డెస్క్:RTI Commissioners | నూతనంగా నియామకం అయిన తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్లు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర సచివాలయంలోని అంబేడ్కర్ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. ఆర్టీఐ కమిషనర్లుగా ప్రభుత్వం పీవీ శ్రీనివాసరావు, మొహసినా పర్వీన్, దేశాల భూపాల్, భోరెడ్డి అయోధ్యరెడ్డిని ప్రభుత్వం సోమవారం నియమించిన విషయం తెలిసిందే.
రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా ఐఎఫ్ఎస్ అధికారి జి చంద్రశేఖర్రెడ్డి(IFS Officer G Chandrasekhar Reddy) శుక్రవారం ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. తాజాగా నలుగురు కమిషనర్లతో ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా రాష్ట్రంలో కొంతకాలంగా సమాచార కమిషనర్ల పదవులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆర్టీఐ(RTI) చట్టం లక్ష్యాలు నెరవేరడం లేదు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం ఐదుగురు కమిషనర్లను నియమించింది. వీరిలో పీవీ శ్రీనివాసరావు, అయోధ్యరెడ్డి జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. వీరిలో అయోధ్యరెడ్డిని సీఎం గతంలోనే సీపీఆర్వోగా నియమించుకున్నారు. తాజాగా ఆయన ఆర్టీఐ కమిషనర్ కావడంతో పీఆర్వోగా మరొకరిని నియమించే అవకాశం ఉంది.