అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Metro Phase 2 | హైదరాబాద్‌లో మెట్రో విస్తరించాలని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. రెండో దశ మెట్రో పనుల కోసం ఇప్పటికే ఆయన పలుమార్లు ప్రధాని మోదీతో పాటు, పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఈ క్రమంలో మెట్రో ఫేజ్ –2 (Metro Phase-2)పనుల్లో కీలక పురోగతి నెలకొంది. రెండో దశ మెట్రో పనులను దాదాపు రూ.19 వేల కోట్ల అంచనాలతో నిర్మించాలని అధికారులు డీపీఆర్(DPR)లు సిద్ధం చేశారు.
Metro Phase 2 | విస్తరణ ఎక్కడంటే..
మెట్రో రెండు దశ పనులను 3 మార్గాల్లో 86.5 కి.మీ. ప్రతిపాదించారు. జేబీఎస్-శామీర్‌పేట, జేబీఎస్-మేడ్చల్; శంషాబాద్ విమానాశ్రయం-ఫ్యూచర్‌సిటీ మార్గాల్లో మెట్రో నిర్మించాలని డీపీఆర్ సిద్ధం చేశారు. ఈ డీపీఆర్‌కు ఇటీవల సీఎస్ నేతృత్వంలోని హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో లిమిటెడ్(Metro Limited) ఆమోదం తెలిపింది. దీంతో ఆ నివేదిక ప్రభుత్వం వద్దకు చేరింది. మంత్రివర్గ సమావేశంలో దీనిని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు.
Metro Phase 2 | అక్కడ అండర్‌గ్రౌండ్‌లో నుంచి..
సాధారణంగా మెట్రో అంటే పిల్లర్లపై ట్రాక్ నిర్మించి రైళ్లు నడుపుతారు. అయితే సెకండ్ ఫేజ్‌లో కొంతభాగం అండర్ గ్రౌండ్లో మెట్రో(Underground Metro)వేయాలని డీపీఆర్‌లో పేర్కొన్నారు. జేబీఎస్ నుంచి కార్ఖానా, అల్వాల్, తూంకుంట, శామీర్‌పేట వరకు 22 కిలోమీటర్ల మేర మెట్రో వేయాలని అనుకుంటున్నారు. ఇందులో హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ రన్‌వే రోడ్డు పక్కనే ఉండటంతో రక్షణ సంస్థ అభ్యంతరం తెలిపింది. దీంతో ఇక్కడ దాదాపు కిలోమీటరున్నర వరకు భూగర్భంలోంచి వెళ్లేలా మెట్రోని ప్రతిపాదించారు. అలాగే జేబీఎస్(JBS) నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్లు మెట్రోని ప్రతిపాదించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 40 కి.మీ. మెట్రో వేయనున్నారు.
Metro Phase 2 | సంయుక్తంగా చేపట్టేలా..
మెట్రో రెండో దశ పనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు(State Government) సంయుక్తంగా చేపట్టేలా డీపీఆర్ రూపొందించారు. అంచనా వ్యయంలో రాష్ట్రం ప్రభుత్వం 30 శాతం, కేంద్రం 18 శాతం భరించేలా ప్రతిపాదించారు. 48 శాతం బ్యాంకుల నుంచి రుణాలు, 4 శాతం పీపీపీలో సమకూర్చుకోవాలని యోచిస్తున్నారు. కాగా గతంతో రెండు అంతస్తులలో మెట్రో నిర్మించాలని ప్రతిపాదించారు. మొదటి అంతస్తులో రోడ్డు, రెండో అంతస్తులో మెట్రో ఉండాలని యోచించారు. అయితే పిల్లర్ల ఎత్తు ఎక్కువ అవుతుండటంతో ఆ ప్రతిపాదనకు HAML విముఖత తెలిపింది. దీంతో తాజా డబుల్ డెక్ లేకుండా డీపీఆర్‌లు సిద్ధం చేశారు.