Sunil Gavaskar Urges BCCI | IPL 2025:డీజేలు.. డ్యాన్స్‌లు వద్దు: సునీల్ గవాస్కర్
Sunil Gavaskar Urges BCCI | IPL 2025:డీజేలు.. డ్యాన్స్‌లు వద్దు: సునీల్ గవాస్కర్

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sunil Gavaskar : ఆపరేషన్ సిందూర్ తర్వాత నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా కొంతమంది ప్రాణాలు కోల్పోయారని, వారికి నివాళిగా ఐపీఎల్ 2025 సీజన్‌లో డీజేలు, డ్యాన్స్‌లు లేకుండా మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కోరాడు. దేశ ప్రజల మనోభావాలకు అనుగుణంగా టోర్నీని పూర్తి చేయాలని సూచించాడు.

భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా కొంతమంది భారత జవాన్లతో పాటు సరిహద్దు ప్రాంతాల్లోని సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఐపీఎల్ 2025 సీజన్‌‌ను బీసీసీఐ వారం పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో టోర్నీని ప్రారంభించడంపై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. సోమవారం రివైజ్డ్ షెడ్యూల్‌ కూడా ప్రకటించింది. శనివారం నుంచి ఐపీఎల్ 2025 మళ్లీ మొదలవ్వనుంది.

అయితే ఈ టోర్నీలో మిగిలిన 17 మ్యాచ్‌లను డీజే సౌండ్స్, డ్యాన్సింగ్ గర్ల్స్ లేకుండా నిర్వహించాలని సునీల్ గవాస్కర్ బీసీసీఐకి సూచించాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే 60 మ్యాచ్‌లు పూర్తయ్యాయని, మిగిలిన మ్యాచ్‌లను ప్రజల మనోభావాలకు అనుగుణంగా పూర్తి చేయాలని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ప్రేక్షకులను అనుమతించినా.. మ్యాచ్‌ల సందర్భంగా సంగీతం, ఓవర్ల మధ్య డీజే సౌండ్స్, డ్యాన్సింగ్ గర్ల్స్ లేకుండా సాధారణ టోర్నీలా నిర్వహించాలని సూచించాడు.