అక్షరటుడే, వెబ్డెస్క్: Farmers | అన్నదాతలకు అదిరిపోయే వార్త చెప్పింది వాతావరణ శాఖ(Meteorological Department). ఈ ఏడాది వర్షాలు ముందుగానే పడతాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని పేర్కొంది. ఇప్పటికే రుతుపవనాలు అండమాన్ నికోబార్ తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 27 వరకు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. జూన్ 12 వరకు తెలంగాణ(Telangana)ను నైరుతి రుతుపవనాలు తాకుతాయని తెలిపింది. సాధారణంగా జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకుతాయి. ఈ సారి ముందుగానే తాకే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో సైతం ముందుగానే నైరుతి రుతుపవనాలు విస్తరించి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
Farmers | అధిక వర్షపాతం..
రాష్ట్రంలో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు భగభగ మండుతుండగా సాయంత్రం కాగానే వరుణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. సాయంత్రం వరకు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలు గాలివానతో కాస్త ఉపశమనం పొందుతున్నాయి. అయితే అకాల వర్షాలతో రైతులు(Farmers) నష్టపోతున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత వారం రోజుల తర్వాత తగ్గుముఖం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Farmers | వానాకాలంపైనే ఆశలు
రైతులు వానాకాలం సీజన్(Rainy Season)పై భారీ ఆశలు పెట్టుకున్నారు. యాసంగిలో పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా బోర్ల కింద వరి సాగు చేసిన రైతులు చివరలో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలు ఎండిపోయి నష్టపోయారు. ఈ తరుణంలో వానాకాలం సీజన్లో వర్షాలు సమృద్ధిగా పడితే పంటలు బాగా పండుతాయని ఆశిస్తున్నారు. వాతావరణ శాఖ(Meteorological Department) కూడా వర్షాలు అధికంగా ఉంటాయని చెప్పడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.