అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Saraswathi Pushkaralu | సరస్వతి పుష్కరాలకు సర్వం సిద్ధం అయ్యాయి. ఈ నెల 15 నుంచి 26 వరకు పుష్కరాలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalpally) జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాలకు తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ ప్రత్యేక చొరవ తీసుకొని పుష్కరాల ఏర్పాట్లను చేపడుతున్నారు.
Saraswathi Pushkaralu | అంతర్వాహినిగా..
కాళేశ్వరం దగ్గర గోదావరి, ప్రాణహిత నదులు ఒకచోట కలుస్తాయి. ఇక్కడ సరస్వతి నది (Saraswati River) అంతర్వాహినిగా ప్రవహిస్తుందని భక్తులు విశ్వాసం. దీంతో కాళేశ్వరం క్షేత్రాన్ని త్రివేణి సంగమం అంటారు. అంతర్వాహినిగా ఉన్న సరస్వతి నదికి వందేళ్లుగా పుష్కరాలు నిర్వహిస్తున్నారు. 12 ఏళ్లకు ఒక్కసారి ఈ నదికి పుష్కరాలు చేస్తారు. ఈ ఏడాది కూడా ఘనంగా పుష్కరాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
Saraswathi Pushkaralu | పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి శ్రీధర్‌బాబు
సరస్వతి పుష్కరాలకు సమయం సమీపిస్తుండడంతో పనుల్లో వేగం పెంచాలని మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు. ఆయన దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. పుష్కరాల సందర్భంగా పుష్కర ఘాట్లు నిర్మిస్తున్నారు. అంతేగాకుండా సరస్వతి మాతా విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల కోసం ఇతర మౌలిక సదుపాయాలు కల్పించారు. భక్తుల కోసం టెంట్ సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
Saraswathi Pushkaralu | నదికి హారతి
పుష్కరాల సందర్భంగా సరస్వతి నదికి 12 రోజుల పాటు నిత్యం హారతి కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. అలాగే నది ఒడ్డున ఏర్పాటు చేసిన సరస్వతి మాతా విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. భక్తులు హారతి కార్యక్రమాన్ని వీక్షించేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆయన సూచించారు.