Virat Kohli | రికార్డుల కోసం బలవంతంగా ఆడను: విరాట్ కోహ్లీ
Virat Kohli | రికార్డుల కోసం బలవంతంగా ఆడను: విరాట్ కోహ్లీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Virat Kohli | ఏ రోజైతే ఆటపై ప్రేమ తగ్గిందని భావిస్తానో ఆ రోజే ఆట నుంచి తప్పుకుంటానని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) తెలిపాడు. ఆడటానికి తనను తాను ఏమాత్రం బలవంతం చేసుకోనని కొన్నేళ్ల క్రితమే స్పష్టం చేశాడు. కోహ్లీ సోమవారం టెస్ట్ క్రికెట్‌(Test Cricket)కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత ఫిట్టెస్ట్ క్రికెటర్ అయిన కోహ్లీ 36 ఏళ్ల వయసులోనే ఆటకు వీడ్కోలు పలకడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ తన రిటైర్మెంట్‌(Retirement)పై విరాట్ కోహ్లీ మొదటి నుంచి క్లారిటీతో ఉన్నాడనే విషయం ఓ పాత వీడియో ద్వారా స్పష్టమైంది.

కొన్నేళ్ల క్రితమే సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గౌరవ్ కపూర్ ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్'(Breakfast with Champions) అనే యూట్యూబ్ షోలో విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ‘నేను క్రికెట్ ఆడటానికి స్ఫూర్తి విజయాలు సాధిస్తుండటమే. ఏ రోజైతే ఆటపై ప్యాషన్ తగ్గిందని భావిస్తానో ఆ రోజు ఆట నుంచి వైదొలుగుతాను. ఆడటానికి నన్ను నేను ఏ మాత్రం బలవంతం చేసుకోను.

ఏదో ఒక రోజు మైదానంలో నిలబడి.. అసలు నేను ఇక్కడ ఏం చేస్తున్నాననే ఆలోచన వచ్చినా.. గెలవాలనే తపన, శక్తి లేకపోయినా నేను ఆట నుంచి తప్పుకుంటాను. జట్టు భారంగా మారానని భావించినా రిటైర్మెంట్ ప్రకటిస్తా.’అని కోహ్లీ(Kohli) చెప్పుకొచ్చాడు. రికార్డుల కోసం ఆడుతున్నాడనే అపవాదు మూటగట్టుకోవడం ఇష్టం లేకనే కోహ్లీ ఆట నుంచి తప్పుకున్నాడనే విషయం ఈ వీడియో ద్వారా స్పష్టంగా అర్థమవుతుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

గత కొన్నేళ్లుగా టెస్ట్‌ల్లో విరాట్ కోహ్లీ నిలకడగా రాణించలేకపోతున్నాడు. ముఖ్యంగా 2020 నుంచి కోహ్లీ తనకు తాను నిర్దేశించుకున్న అత్యున్నత ప్రమాణాలను అందుకోలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. 2019 చివర్లో 55కి పైగా ఉన్న అతని టెస్ట్ బ్యాటింగ్(Test batting) సగటు.. ఇప్పుడు 46.85కు పడిపోయింది. ఒక్క సిరీస్‌లోనే నాలుగు సెంచరీలు చేసిన కోహ్లీ.. మూడేళ్ల పాటు మూడంకెల స్కోర్ అందుకోలేకపోయాడు. గతేడాది న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలతో కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే గౌరవంగా తప్పుకోవాలని కోహ్లీ భావించాడు.