అక్షరటుడే, వెబ్డెస్క్: Mother love : సృష్టిలో అమూల్యమైనది తల్లిప్రేమ.. ఎలాంటి కల్మషం లేనిది.. ఎంతో పవిత్రమైనది.. వెల కట్టలేనిది.. అంతకు మించింది మరోటి లేదనేది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ తల్లీబిడ్డలు మాతృప్రేమను కలుషితం చేశారు. కన్నప్రేమకు అర్థమే మార్చారు. ముక్కుపచ్చలారని చిన్నారిని దారుణంగా కడతేర్చారు. ఎన్నో ఆశయాలతో ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఆ పసికందు.. అమ్మను గుర్తుపట్టేలోపే అమ్మ, అమ్మమ్మనే కాలయముడిగా మారారు. కులం కోసం మానవత్వం, నైతిక విలువలు, చివరికి మానవ బంధాలనే ప్రశ్నార్థకంగా మిగిల్చారు.
రెండో పెళ్లికి అడ్డుగా ఉందని అమ్మ, అమ్మమ్మ కలిసి ఐదు నెలల పసికందును చంపేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh లోని పిఠాపురం మండలం Pithapuram mandal లో చోటుచేసుకుంది. నరసింగపురానికి చెందిన శైలజ రెండేళ్ల క్రితం సతీష్ అనే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
కొద్ది నెలల క్రితం తిరిగి ఇంటికొచ్చిన శైలజ.. ఐదు నెలల క్రితం యశ్విత అనే పండంటి పసిబిడ్డకు జన్మనిచ్చింది. ఇదిలా ఉండగా.. శైలజ మనసు మార్చేసి, ఆమెకు తన కులానికి చెందిన వ్యక్తితో రెండో పెళ్లి జరిపించాలని శైలజ అమ్మ అన్నవరం నిర్ణయించింది.
ఇందుకు పాప యశ్విత అడ్డు తొలగించాలని భావించింది. ఈ నెల 6న ఐదు నెలల పసికందును గొంతు నులిమి చంపేసింది. అనంతరం ఇంటి పక్కనే ఉన్న బావిలో పడేసింది. తర్వాత ఎవరో క్షుద్ర పూజలు చేసి తమ చిన్నారిని చంపేశారని ప్రచారం చేశారు. ఇందుకు అనుగుణంగా ఇంటి ముందర ముగ్గు వేసి, నిమ్మకాయలు పెట్టి నమ్మించారు. కానీ, పోలీసులకు అనుమానం వచ్చి, తమ స్టైల్లో విచారణ చేపట్టగా.. చిన్నారిని తామే చంపినట్లు అమ్మ, అమ్మమ్మ ఒప్పుకొన్నారు.