అక్షరటుడే, హైదరాబాద్: gift deed : ప్రేమ, వాత్సల్యంతో మనుమడు, మనుమరాలికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ను చట్ట విరుద్ధమైన ప్రక్రియ ద్వారా రద్దు చేయడానికి వీల్లేదని తెలంగాణ హైకోర్టు Telangana High Court స్పష్టం చేసింది. సీనియర్ సిటిజన్స్ చట్టం Senior Citizens Act కింద గిఫ్ట్‌ను రద్దు చేయాలంటే అందులో షరతులను ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావాలంది.
గిఫ్ట్ ఇచ్చే ముందు పెద్దవారి రోజువారీ అవసరాలు, మందులు అందించాలన్న షరతు ఉంటే.. వాటిని అమలు చేయనప్పుడు గిఫ్ట్‌ను కచ్చితంగా రద్దు చేసుకునే హక్కు సీనియర్ సిటిజన్‌కు ఉంటుందని వివరించింది.
ఆధునిక ధోరణుల నేపథ్యంలో వృద్ధులైన తల్లిదండ్రుల నిర్వహణ, సంక్షేమం దృష్టిలో ఉంచుకుని తీసుకొచ్చిన గొప్ప చట్టం.. సీనియర్ సిటిజన్ చట్టమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎక్కువ కుటుంబాల్లో వృద్ధులైన తల్లిదండ్రుల వైద్యం, మందులు తదితర కనీస అత్యవసరాలను కనీసం పట్టించుకోవడంలేదని, ఇలాంటి సమయాల్లో పిల్లలు, బంధువులకు ఇచ్చిన గిఫ్ట్‌ను వారు రద్దు చేసుకోవచ్చని పేర్కొంది.
కానీ, కేవలం ప్రేమ, వాత్సల్యంతో ఎలాంటి షరతులు లేకుండా ఇచ్చిన గిఫ్ట్‌లను రద్దు చేసుకోవడానికి వీల్లేదని
హైకోర్టు స్పష్టం చేసింది. తండ్రి ఇచ్చిన గిఫ్ట్‌పై వారసులకు అభ్యంతరాలుంటే సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లో భవనంలోని 5, 6 అంతస్తులను 2019లో ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ను అమ్మ, నాన్న ఫిర్యాదుపై ఆర్డీవో రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ అమెరికా America లోని రోహిత్ శౌర్య హైకోర్టులో పిటిషన్ వేశారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 3, 4, 5, 6 అంతస్తులను పిటిషనర్, అతని సోదరుడికి తాత సుబ్బారావు కానుకగా గిఫ్ట్ డీడ్ ఇచ్చారన్నారని చెప్పారు. కానీ, సీనియర్ సిటిజన్స్ చట్టం కింద గిఫ్ట్ రద్దుకు ఆర్డీవో ఆదేశాలు జారీ చేశారని, అమెరికాలోని పిటిషనర్లకు నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నారు.
ప్రతివాది, సుబ్బారావు కుమారుడు కౌంటరు దాఖలు చేస్తూ తన తండ్రి చనిపోయారని, నలుగురు పిల్లలు ఉన్నారని, తండ్రి ఆస్తి పిల్లలకు చెందుతుందని అన్నారు. ఆ విషయం అతనికి తెలిసినా ఉద్దేశపూర్వకంగా వారసులను ప్రతివాదులుగా చేయకుండా, అది కూడా 9 నెలల తర్వాత తమ సోదరి కుమారులు పిటిషన్ వేయడం చెల్లదని పేర్కొన్నారు.
ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. సీనియర్ సిటిజన్స్ చట్టం కింద గిఫ్ట్‌ను రద్దు చేయాలనుకుంటే అందులో షరతులను ఉల్లంఘించి ఉండాలని తీర్పునిచ్చారు.