అక్షరటుడే, వెబ్‌డెస్క్: Dog eats young man’s body : మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురంలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం కోసం ఉంచిన మృతదేహాన్ని కుక్క పీక్కుతింది. విషయం వెలుగులోకి రావడంతో ఆసుపత్రిలో కలకలం చోటుచేసుకుంది. దీనిపై సివిల్ సర్జన్ విజయ్‌వర్గియా దర్యాప్తునకు ఆదేశించారు.
ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. దీనిపై ఆస్పత్రి డీఎంకు, ముఖ్యమంత్రికి మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందంటే.. జిల్లాలోని పాలన్‌పూర్‌లో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నిఖిల్ చౌరాసియా (21) తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. కాగా, వైద్యులు అతడిని పరీక్షించి, చనిపోయినట్లు నిర్ధారించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చూరీకి తరలించారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించబోతున్నట్లు ఆస్పత్రి సివిల్ సర్జన్ సుధీర్ విజయవర్గియా చెప్పడంతో.. మృతుడి బంధువు అంకిత్ గోహిల్ పోస్టుమార్టం గది వద్ద డాక్టరు కోసం ఎదురుచూస్తున్నాడు. వైద్యుడు రావడం ఆలస్యం కావడంతో నీళ్లు తాగుదామని సదరు బంధువు బయటకు వచ్చాడు. తిరిగి వచ్చి చూసే సరికి.. మృతదేహాన్ని ఒక కుక్క పీక్కు తింటోంది. దీంతో గట్టిగా అరుస్తూ దానిని తరిమికొట్టాడు.
ఘటన జరిగిన సమయంలో అక్కడ గార్డు లేడని సదరు బంధువు అంకిత్ వాపోయాడు. ఈ ఘటనకు సంబంధించి ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కాగా, పోస్టుమార్టం సమయంలో ఇంట్లో ఉన్న సెక్యూరిటీ గార్డుకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు సివిల్ సర్జన్ ప్రకటించారు.