అక్షరటుడే, కామారెడ్డి : Sadashiva Nagar | ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కారు బోల్తా పడిన ఘటనలో ఓ నేవి ఉద్యోగి భార్య మృతి చెందింది. ఈ ఘటన సదాశివనగర్ మండలం మర్కల్ చౌరస్తా వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఆదిలాబాద్‌కు చెందిన అముల్ నేవిలో పనిచేస్తుండగా, సెలవులు రద్దు కావడంతో తన భార్య ప్రణీత(19)తో కలిసి కారులో విశాఖపట్నం బయలుదేరారు. ఈ క్రమంలో కారు మర్కల్ చౌరస్తా వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో బోల్తా పడింది. దీంతో కారులోని ప్రణీత అక్కడికక్కడే మృతి చెందగా, సీటు బెల్టు పెట్టుకున్న అముల్ ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రణీత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
