అక్షరటుడే, హైదరాబాద్: Walking | నడక ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడంలో ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో పరిశోధనల్లోనూ ఇది నిరూపితమైంది. సంపూర్ణ ఆరోగ్యంగా (Healthy) ఉండాలంటే రోజుకు కనీసం 7 వేల అడుగులు వేయాలని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, దీర్ఘకాలిక అనారోగ్యాల ప్రమాదాన్ని నివారించడానికి వాకింగ్ (Walking) దోహదం చేస్తుందని తేలింది. 160,000 కంటే ఎక్కువ మంది పెద్దలపై నిర్వహించిన 57 అధ్యయనాల ఫలితాలను సమీక్షించిన తర్వాత ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్ (The Lanest Public Health) ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించింది. నడక వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వివరించింది. ఆకస్మకి మరణాలతో పాటు వ్యాధుల నుంచి గణనీయమైన రక్షణ పొందవచ్చని పరిశోధకులు తేల్చారు.
Walking | ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
ఆకస్మిక మరణాలతో పాటు గుండె జబ్బుల (heart disease) ప్రమాదం తక్కువగా సంభవిస్తుందని పరిశోధనలో తేలింది. రోజువారీగా 7,000 అడుగులు నడిస్తే హృదయ సంబంధ వ్యాధుల వల్ల కలిగే మరణాల ముప్పు 47% తక్కువగా ఉంటుందని వెల్లడైంది. మానసిక ప్రశాంతత కూడా కలుగుతుందని, చిత్తవైకల్యం వచ్చే అవకాశం 38% తక్కువగా, టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం 14% తక్కువగా ఉంటుందని పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో డిప్రెషన్ లక్షణాలు 22% తగ్గాయని పరిశోధకులు తెలిపారు. 60 ఏళ్లు పైబడిన వారిలోనూ అనారోగ్య సమస్యలు (health problems) 28 శాతం దూరమయ్యాయని పేర్కొన్నారు.
Walking | నడక సులువే..
రోజుకు 7 వేల అడుగుల లక్ష్యం చాలా సులువేనని పరిశోధకులు తెలిపారు. రోజువారీగా చేసే పనులతోనే సగం టార్గెట్ పూర్తవుతుందని మిగతాది చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పారు. “ఏడు వేల అడుగులు (7 thousand Steps) ఎక్కువ మంది పెద్దలకు వాస్తవిక లక్ష్యం. ఇది కొలవదగినది, ట్రాక్ చేయడం సులభం, జిమ్ సభ్యత్వాలు లేదా ఖరీదైన పరికరాలు అవసరం లేదు. ప్రతి రోజు టార్గెట్‌ను చేరుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చని” సిడ్నీ విశ్వవిద్యాలయంలో (University of Sydney) ప్రధాన రచయిత, ప్రజారోగ్య పరిశోధకురాలు డాక్టర్ మెలోడీ డింగ్ తెలిపారు.
Walking | స్థిరత్వం ఉండాలి..
చాలా మంది రోజువారీగా 4 వేల అడుగులు వేస్తారని అంచనా. ఆ మాత్రం నడవడం వల్ల కూడా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు (health benefits) చేకూరుతాయని పరిశోధనలో తేలింది. అయితే, ఒకరోజు ఎక్కువగా, మరొకర రోజు తక్కువగా కాకుండా నడకలో స్థిరత్వం ఉండాలని జీవనశైలి వైద్య నిపుణుడు డాక్టర్ కన్వర్ కెల్లీ తెలిపారు. “మీ దైనందిన జీవితంలో నడకను భాగం చేసుకోవడం కీలకం. అంటే మెట్లు ఎక్కడం, భోజన విరామ సమయంలో నడవడం లేదా కాలినడకన పనులు చేయాలని” ఆయన సూచించారు.