అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Zomato orders | దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలను (New Year celebrations) ఘనంగా జరుపుకున్నారు. కొత్త సంవత్సరానికి ప్రజలు ఉత్సాహంగా స్వాగతం పలికారు.
నూతన సంవత్సర వేడుకల వేళ జొమాటో, బ్లింకిట్ (Zomato and Blinkit) 75 లక్షలకు పైగా ఆర్డర్లను డెలివరీ చేసి రికార్డు సృష్టించాయి. ఈ విషయాన్ని కంపెనీ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ గురువారం తెలిపారు. డెలివరీ భాగస్వాములకు ఎటువంటి అదనపు ప్రోత్సాహకాలు లేకుండానే ఇది సాధ్యమైందన్నారు. జొమాటో, బ్లింకిట్ బుధవారం రికార్డు వేగంతో డెలివరీ చేశాయని, గిగ్ వర్కర్ల సమ్మె ప్రభావం ఏ మాత్రం పడలేదని ఆయన పేర్కొన్నారు.
Zomato orders | 63 లక్షల మంది కస్టమర్లకు..
దేశంలో బుధవారం 63 లక్షల మంది కస్టమర్లకు 75 లక్షలకు పైగా ఆర్డర్లు డెలివరీ చేశామని ఆయన వెల్లడించారు. జోమాటో, బ్లింకిట్ రెండ్ సంస్థల్లోని 4.5 లక్షలకు పైగా గిగ్‌వర్కర్లు ఇందుకోసం పనిచేశారని చెప్పారు. వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బెదిరింపులు ఉన్నప్పటికీ పని చేశారని ప్రశంసించారు. సమ్మె కారణంగా ఎలాంటి అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వలేదని చెప్పారు. ప్రతి ఏడాది న్యూ ఇయర్ ముందు రోజు ఇచ్చినట్లే చెల్లింపులు చేసినట్లు స్పష్టం చేశారు.
Zomato orders | ఎక్కువ మందికి ఉపాధి
గిగ్ వర్కర్ల సమ్మె (Gig Workers Strike)పై దీపిందర్ గోయల్ స్పందించారు. ఒక వ్యవస్థ ప్రాథమికంగా అన్యాయంగా ఉంటే, అది దానిలో పనిచేయడానికి ఎవరు ముందుకు రారని చెప్పారు. ఒకవేళ వచ్చిన ఎక్కువ కాలం ఉండరన్నారు. కానీ గిగ్ వర్కర్లుగా ఎంతో మంది చాలా కాలంగా పని చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం చేసే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన సూచించారు. గిగ్ ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో వ్యవస్థీకృత ఉద్యోగ సృష్టికి అతిపెద్ద వనరులలో ఒకటి అని గోయల్ తెలిపారు. కాగా న్యూ ఇయర్ సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి 12 గంటల మధ్య పీక్ అవర్స్ సమయంలో జొమాటో తన డెలివరీ భాగస్వాములకు ఆర్డర్‌కు రూ.120 నుంచి రూ.150 వరకు చెల్లింపులు చేసినట్లు సమాచారం.