అక్షరటుడే, హైదరాబాద్: Government Schools : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister A. Revanth Reddy) తెలిపారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడానికి అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర సదుపాయాల కల్పనకు ఎంత వ్యయమైనా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు.
పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ (Telangana Command Control Center – ICCC) లో విద్యా శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. విద్యా ప్రమాణాల పెంపు లక్ష్యంతో రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బోధన ప్రమాణాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు సూచించారు. విద్యార్థులకు భాషా పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాల పెంపునకు వీలుగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని చెప్పారు.
హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కల్పిస్తే భవిష్యత్తులో వారు తమకు ఇష్టమైన రంగంలో రాణించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పట్టణీకరణ వేగంగా సాగుతున్న నేపథ్యంలో విద్యా శాఖ పురపాలక శాఖతో సమన్వయం చేసుకొని హెచ్ఎండీఏ(HMDA), మున్సిపల్ లేఅవుట్లలో సామాజిక వసతుల కోసం గుర్తించిన స్థలాల్లో పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ(SC, ST, BC, Minority) ఇలా వివిధ విభాగాల కింద ఇంటర్మీడియట్ వరకు ఉన్న వివిధ విద్యా సంస్థలను హేతుబద్దీకరించి ప్రతి పాఠశాలలో నిర్ధిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
నాణ్యమైన భోజనం, యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు అందిస్తుండడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నారని, డే స్కాలర్స్‌కూ ఆ పాఠశాలల్లోనే అవన్నీ అందించే విషయంపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.
పిల్లలకు కుటుంబం, సమాజం ప్రాధాన్యాన్ని వివరించడంతో పాటు కుటుంబం, సమాజం పట్ల వారి బాధ్యతను తెలియజేసేలా కౌన్సెలింగ్ ఇప్పిస్తే వారు మానసికంగా దృఢంగా తయారవడంతో పాటు బాధ్యతాయుతమైన పౌరులుగా రాణిస్తారని అన్నారు. సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
1 comment
[…] పర్యటించారు. ప్రభుత్వ పాఠశాల (Government Schools)ల్లో కొనసాగుతున్న ప్రత్యేక పనులు, […]
Comments are closed.