అక్షరటుడే, కామారెడ్డి: Panchayat Elections | కామారెడ్డి జిల్లాలో (Kamareddy district) పోలింగ్ 50 శాతం దాటింది. పది మండలాలలో మొత్తం ఇప్పటి వరకు 53.31 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2,42,913 ఓటర్లకు ఉదయం 11 గంటల వరకు 1,29,493 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
భిక్కనూర్ మండలంలో 51.78 శాతం, బీబీపేటలో 49.09, దోమకొండ, కామారెడ్డి 56.45, మాచారెడ్డి 52.46, పాల్వంచ 55.89, రాజంపేట 58.02, రామారెడ్డి 50.84, సదాశివనగర్ 56.42, తాడ్వాయి మండలంలో 52.59 శాతం పోలింగ్ నమోదైంది. అన్ని మండలాలలో 50 శాతం పోలింగ్ దాటగా బీబీపేటలో మాత్రం 50 శాతానికి చేరువలో ఉంది
Panchayat Elections | గర్గుల్ గ్రామంలో స్వల్ప వాగ్వాదం
మొదటి విడత ఎన్నికలు జరిగే పది మండలాలలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లను ఇతరులు తీసుకెళ్తున్నారని ఓ సర్పంచ్ అభ్యర్థి (Sarpanch candidate) అనుచరులు ఆబ్జెక్షన్ చేశారు. పంచాయతీ సిబ్బంది ఉండగా ఇతరులు ఎలా తీసుకుని వెళ్తారని పోలీసు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అయితే డ్యూటీలో ఉన్న పంచాయతీ సిబ్బంది మాత్రమే ఓటర్లను వీల్ చైర్లో తీసుకెళ్తున్నారని, అభ్యంతరం ఉంటే లోపలికి వెళ్లి చూసుకోవచ్చని పోలీస్ సిబ్బంది పేర్కొని సముదాయించారు.
Panchayat Elections | పోలింగ్ కేంద్రాల సందర్శించిన కలెక్టర్, ఎస్పీ
మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan), ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) పర్యటించారు. పోలింగ్ సరళిని పరిశీలించారు. కామారెడ్డి మండలం గర్గుల్, సదాశివనగర్ మండల కేంద్రంలో కలెక్టర్ పర్యటించి పోలింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Panchayat Elections | ఓటర్లతో మాటాముచ్చట..
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అడ్లూర్ ఎల్లారెడ్డి, మర్కల్, సదాశివనగర్, గోకుల్ తండా, రామారెడ్డి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఓటర్లతో ముచ్చటించారు. ఓ వృద్ధురాలికి స్వయంగా వీల్ చైర్ తెప్పించి అందులో కూర్చోబెట్టారు. రామారెడ్డి మండల కేంద్రంలో ఏడాది పాపను తీసుకుని ఓటేయడానికి వచ్చిన మహిళను ఎస్పీ గమనించి ఆమెతో మాట్లాడారు. చిన్న పాపను తీసుకుని వచ్చి ఓటుహక్కు వినియోగించుకోవడం అభినందనీయమన్నారు.