అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IND vs SA | గువాహటిలో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దక్షిణాఫ్రికా (South Africa) 408 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.
ఇది భారత టెస్టు చరిత్రలో 400 పరుగులకు పైగా తేడాతో వచ్చిన తొలి ఓటమిగా చెబుతున్నారు. బ్యాటింగ్–బౌలింగ్–కెప్టెన్సీ మూడు విభాగాల్లోనూ టీమిండియా పూర్తిగా విఫలమైంది. ఈ వైట్‌వాష్‌కు ప్రధానంగా 5 కారణాలు స్పష్టం అయ్యాయి.
గౌతమ్ గంభీర్ వ్యూహాలు ప్రశ్నార్థకం
టీమిండియా (Team India) హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయాలు సిరీస్ మొత్తానికీ తీవ్ర విమర్శలకు గురయ్యాయి. టీ20ల్లో విజయాలు సాధించినప్పటికీ, టెస్టుల్లో ఆయన వ్యూహాలు ఫలితం ఇవ్వలేదు. తన కోటరిలోని ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఫామ్‌లో లేని ఆటగాళ్లను పట్టుబట్టి ఆడించడం, కీలక సందర్భాల్లో సరైన బౌలింగ్ మార్పులు చేయకపోవడం టీమ్‌ను కుదేలు చేశాయి. వ్యూహాత్మక లోపాలే రెండు టెస్టుల్లోనూ తీవ్ర ప్రభావం చూపాయి.
రిషబ్ పంత్ కెప్టెన్సీ అనుభవం లేకపోవడం
హోమ్ సిరీస్ అయినప్పటికీ పంత్ కెప్టెన్సీ అనుభవం లేకపోవడం స్పష్టంగా కనిపించింది. మ్యాచ్ పరిస్థితులను అంచనా వేయడంలో, బౌలర్లను రొటేట్ చేసే విషయంలో, నిర్ణయాత్మక సమయాల్లో ధైర్యంగా ఉండడంలో ఆయన వైఫల్యం ప్రత్యక్షంగా ఫలితాలను ప్రభావితం చేసింది. టెస్ట్ ఫార్మాట్లో నాయకత్వం ఇచ్చే స్థిరత్వం భారత్‌లో కనిపించలేదు.
నంబర్–3 ప్రయోగం మరోసారి ఫెయిల్
చతేశ్వర్ పుజారా తరువాత భారత్ నంబర్-3 స్థానంలో ఎవరిని ఆడించాలో ఇంకా స్పష్టత లేదు. మొదటి టెస్టులో వాషింగ్టన్ సుందర్ ఆ స్థానంలో రాణించినప్పటికీ, రెండో టెస్టులో సాయి సుదర్శన్ (Sai Sudarshan)ను అక్కడ బ్యాటింగ్‌కు పంపడం పెద్ద తప్పిదంగా మారింది. నిరంతరం మారుతున్న బ్యాటింగ్ ఆర్డర్ ఆటగాళ్లలో గందరగోళం కలిగించింది.
అదనపు ఆల్‌రౌండర్ల వ్యూహం పని చేయలేదు
రెండు టెస్టుల్లోనూ ఇండియా స్పెషలిస్ట్ టెస్ట్ ప్లేయర్లకు బదులుగా ఆల్రౌండర్లపై ఎక్కువ దృష్టిపెట్టింది. కానీ ఈ వ్యూహం పూర్తిగా ఫెయిల్ అయింది. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ కుదరకపోవడం, కీలక సందర్భాల్లో అనుభవం గల టెస్ట్ బ్యాటర్లు లేకపోవడం జట్టును కష్టాల్లో పడేసింది.
స్పిన్ ముందు కుప్పకూలిన భారత బ్యాటింగ్
భారత బ్యాటర్స్ స్పిన్‌ను సులభంగా ఆడతారని ఉన్న నమ్మకాన్ని ఈ సిరీస్ ఛేదించింది. దక్షిణాఫ్రికా స్పిన్నర్ ముత్తుస్వామి ఇదే పిచ్‌పై 119 పరుగులు చేయగా, మార్కో జాన్సెన్ 93 పరుగులు సాధించడం భారత బ్యాటర్ల వైఫల్యాన్ని బయటపెట్టింది. స్పిన్‌కు సరైన టెక్నిక్ , అప్రమత్తత చూపడంలో భారత్ పూర్తిగా తేలిపోయింది.
మొత్తంగా భారత్ ఈ సిరీస్‌లో దారుణ ప్రదర్శన కనబరిచింది. కోచ్ వ్యూహాలు, కెప్టెన్ అనుభవం, నిరంతరం మారుతున్న బ్యాటింగ్ ఆర్డర్, స్పిన్‌కు ఎదురు నిలవలేకపోవడం వంటి కారణాలు వైట్‌వాష్‌కి దారితీశాయి. రాబోయే సిరీస్‌లలో ఈ లోపాలను సరిదిద్దకపోతే టెస్ట్ ఫార్మాట్లో భారత్‌కు మరింత కష్టాలు తప్పవని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కోచ్‌గా తన భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్నపై గంభీర్ స్పష్టంగా స్పందించాడు. “ఈ నిర్ణయం బీసీసీఐ (BCCI) చేతిలో ఉంటుంది. నేను కొనసాగాలా–వద్దా అన్నది బోర్డు నిర్ణయిస్తుంది. నేను కాదు… దేశం ముఖ్యం. భారత్ ఇటీవల ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్ డ్రా చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది, ఆసియా కప్ సాధించింది. అప్పుడూ నేను కోచ్‌గానే ఉన్నా, ఇప్పుడూ అదే. ఇది ఇప్పటికీ నేర్చుకుంటున్న జట్టు ఇది,” అని గంభీర్ పేర్కొన్నాడు.