Homeతాజావార్తలుMaoists Surrender | డీజీపీ ఎదుట లొంగిపోయిన 37 మంది మావోయిస్టులు

Maoists Surrender | డీజీపీ ఎదుట లొంగిపోయిన 37 మంది మావోయిస్టులు

తెలంగాణ పోలీసుల ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో రాష్ట్ర కమిటీ సభ్యులు ముగ్గురు ఉన్నట్లు డీజీపీ శివధర్​రెడ్డి తెలిపారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists Surrender | మావోయిస్ట్​ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. 37 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల (Telangana Police) ఎదుట లొంగిపోయారు. మేరకు డీజీపీ శివధర్​రెడ్డి వివరాలు వెల్లడించారు.తెలంగాణకు చెందిన ఇద్దరు, ఛత్తీస్​గఢ్​కు చెందిన 35 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యల సాంబయ్య అలియాస్ ఆజాద్‌, నారాయణ అలియాస్‌ రమేశ్‌, సోమ్‌దా అలియాస్‌ ఎర్ర ఉన్నట్లు డీజీపీ తెలిపారు. ఏవోబీ ప్రాంతంలో పార్టీ నిర్మాణంలో ఆజాద్ కీలక పాత్ర పోషించాడు. ఆయనపై రూ.20 లక్షల రివార్డు ఉన్నట్లు డీజీపీ (DGP Shivdhar Reddy) తెలిపారు. లొంగిపోయిన వారిలో 25 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఖమ్మం డివిజన్​ సభ్యులు 9 మంది సరెండర్​ అయ్యారు. వారి నుంచి 303 రైఫిల్, జీ3 రైఫిల్, ఎస్​ఎల్​ఆర్​, ఏకే-47 రైఫిల్, బుల్లెట్లు, క్యాట్రేజ్ స్వాధీనం చేసుకున్నారు.

Maoists Surrender | అజ్ఞాతంలో 59 మంది..

రాష్ట్రానికి చెందిన 59 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని డీజీపీ తెలిపారు. ఇందులో ఐదుగురు సెంట్రల్​ కమిటీ సభ్యులు అన్నారని వివరించారు. ఈ ఏడాది మొత్తం 465 మంది మావోయిస్టులు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ముందుకు వచ్చి లొంగిపోయారని డీజీపీ వెల్లడించారు. మిగతా వారు కూడా లొంగిపోవాలని సూచించారు. నాయకులు, అధికారులు, మీడియా, పోలీసులు ఇలా ఎవరి ద్వారా అయినా లొంగిపోవచ్చని తెలిపారు. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Maoists Surrender | మావోయిస్ట్​లకు ఎదురుదెబ్బ

మావోయిస్ట్​ పార్టీ కీలక నేత మాడ్వి హిడ్మా (Madvi Hidma) ఇటీవల ఎన్​కౌంటర్​లో మృతి చెందిన విషయం తెలిసిందే. హిడ్మా ఎన్​కౌంటర్తో ఇప్పటికే భారీగా నష్టపోయిన పార్టీకి మరో షాక్​ తగిలింది. రాష్ట్ర కమిటీ నేతలు సహా 37 మంది లొంగిపోయారు. రాష్ట్ర కమిటీ సభ్యులు లొంగిపోవడంతో తెలంగాణలో మావోయిస్ట్​ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.

Maoists Surrender | ఆపరేషన్​ కగార్​తో..

దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆపరేషన్​ కగార్​ ప్రారంభించింది. దీంతో వేల సంఖ్యలో బలగాలు జల్లెడ పడుతున్నాయి. డ్రోన్​లు, ఆధునిక సాంకేతికత, పక్కా సమాచారంతో బలగాలు కూంబింగ్​ చేపడుతూ మావోయిస్టుల ఆట కట్టిస్తున్నాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్​కౌంటర్లలో వందలాది మంది నక్సల్స్​ మృతి చెందారు. ముఖ్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (Nambala Kesava Rao) ఎన్​కౌంటర్​ అనంతరం చాలా మంది లొంగుబాట పట్టారు. తాజాగా హిడ్మా, టెక్​ శంకర్​ మృతితో పార్టీ బలహీనంగా మారింది. దీంతో కీలక నేతలు సైతం అడువులను వీడాలని నిర్ణయించుకున్నారు.

Maoists Surrender | లొంగు‘బాట’

ఆపరేషన్​ కగార్ (Operation Kagar)​తో భారీ సంఖ్యలో కేడర్​తో పాటు అగ్ర నాయకులు హతం అవుతుండటంతో మావోయిస్టులు ఆయుధాలు వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు లొంగుబాట పట్టారు. ఇప్పటికే చాలా మంది సరెండర్​ అయ్యారు. ముఖ్యంగా అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్​రావు, ఆశన్న తమ అనుచరులతో లొంగిపోయారు. తాజాగా తెలంగాణ పోలీసుల ఎదుట 37 మంది మావోయిస్టులు సరెండర్​ అయ్యారు.