అక్షరటుడే, హైదరాబాద్: Lambodharudi laddu | గణేశ్ నిమజ్జన శోభాయత్ర వేడుకగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర (Ganesh Shobhayatra) నిర్వహిస్తున్నారు.
కాగా, ఆయా మండపాల్లో లంబోధరుడి లడ్డూ వేలం (auction) ఇప్పటికే పూర్తయింది. లడ్డూ కోసం రూ. లక్షలు, కోట్లు పెట్టడానికి కూడా భక్తులు వెనుకాడటం లేదు. నవరాత్రులు పూజలు అందుకున్న లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. వినాయకుడి లడ్డూను దక్కించుకునే మంచి జరుగుతుందనే విశ్వాసం భక్తుల్లో ఉంది.
వినాయకుడి నవరాత్రి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. కాగా, తెలంగాణలోని హైదరాబాద్‌లో జరిగే వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఎందుకంటే లడ్డూ వేలం.. వినాయకుడి లడ్డూను దక్కించుకునేందుకు ఇక్కడి భక్తులు ఎగబడుతుంటారు. ఈసారి హైదరాబాద్‌లో లడ్డూ వేలం ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. లడ్డూ వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికి ప్రపంచాన్ని ఆకర్షించడం విశేషం. ఎందుకంటే గత రికార్డులను బద్దలు కొడుతూ అంచనాలను మించి రికార్డు ధర పలికాయి.
బాలాపూర్ గణపతి లడ్డూ.. గతేడాది రికార్డులను బద్దలు కొడుతూ రూ. 35 లక్షలు ధర పలికింది. రిచ్‌మండ్ విల్లాలో గణనాథుడి లడ్డూను విల్లా సభ్యులు ఏకంగా రూ.2.32 కోట్లకు దక్కించుకున్నారు. ఇక రాయదుర్గంలోని మై హోమ్ భుజాలో వినాయకుడి లడ్డూ రూ.51.77 లక్షలు పలికింది. ఇంతటి క్రేజ్ ఉన్న లంబోధరుడి చేతిలోని లడ్డూను ఓ విద్యార్థి కేవలం రూ. 99 కే దక్కించుకున్నాడు.
Lambodharudi laddu | 760 టోకెన్లు..
కొత్తపేటలో ఒక డిగ్రీ విద్యార్థికి అదృష్టం వరించింది. శ్రీ ఏకదంత యూత్ అసోసియేషన్ 333 కిలోల లడ్డూను ఏర్పాటు చేసింది. నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు చేసింది. వినాయకుడి లడ్డూ అందించడానికి లక్కీ డ్రా నిర్వహించింది. 760 టోకెన్లను భక్తులకు విక్రయించింది. టోకెన్ ధర రూ. 99గా నిర్ణయించింది.
చివరి రోజు డ్రా తీయగా.. బీబీఏ విద్యార్థి సాక్షిత్ గౌడ్ పేరు వచ్చింది. ఒకవైపు రూ.కోట్లు, లక్షలు పలుకుతున్న లడ్డూను విద్యార్థి రూ.99 కే దక్కించుకోవడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.