అక్షరటుడే, వెబ్డెస్క్: Jubilee Hills by-election | జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికకు భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు దాఖలు చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు ఏకంగా 117 మంది అభ్యర్థులు 194 సెట్ల నామినేషన్లు వేయడం గమనార్హం. రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలు కావడంతో రాష్ట్రం మొత్తం జూబ్లీహిల్స్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. నిజామాబాద్ ఎంపీ స్థానానికి 2019లో 183 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. పసుపు రైతులు పోటీ చేయడంతో ఆ ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ప్రస్తుతం అంతకు మించి జూబ్లీహిల్స్లో 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయడం గమనార్హం.
Jubilee Hills by-election | అర్ధరాత్రి వరకు..
నామినేషన్ల (Nominations) స్వీకరణకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే సమయం ఉంది. అయితే భారీ సంఖ్యలో అభ్యర్థులు రావడంతో గడువులోగా దాఖలు చేయలేకపోయారు. దీంతో 3 గంటల వరకు వచ్చిన వారికి అధికారులు టోకెన్లు ఇచ్చి అర్ధరాత్రి వరకు నామినేషన్లు తీసుకున్నారు. ఈ రోజు (బుధవారం) నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. చెల్లని వాటిని తొలగిస్తారు. దీంతో కొంతమంది అభ్యర్థులు తగ్గే అవకాశం ఉంది. అలాగే ఉపసంహరణకు ఈ నెల 24 వరకు గడువు ఉంది. ఆ లోపు పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లపై వెనక్కి తగ్గుతారని తెలుస్తోంది. 24న తర్వాత బరిలో ఉండే అభ్యర్థులపై స్పష్టత రానుంది.
Jubilee Hills by-election | ప్రభుత్వానికి వ్యతిరేకంగా..
కాంగ్రెస్ (Congress) ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో రికార్డు స్థాయిలో నామినేషన్లు వచ్చాయి. ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన వారు, ఆర్ఆర్ఆర్ బాధితులు, నిరుద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల ప్రతినిధులు నామినేషన్లు వేశారు. కాగా నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. 14న ఫలితాలు ప్రకటించనున్నారు.
Jubilee Hills by-election | ఈవీఎంలతోనే..
ఎంతమంది అభ్యర్థులు పోటీ చేసినా.. ఈవీఎం (EVM)లతో ఎన్నికలు నిర్వహించవచ్చని అధికారులు స్పష్టం చేశారు. గతంలో నిజామాబాద్ (Nizamabad) పార్లమెంట్ స్థానానికి 183 మంది పోటీ చేయగా.. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 12 ఈవీఎంలను ఉపయోగించారు. అయితే ఎన్నికల సంఘం కొత్తగా ప్రవేశ పెట్టిన ఎం3 రకం ఈవీఎంపై గరిష్టంగా 384 మంది అభ్యర్థుల పేర్లను చేర్చవచ్చని తెలిపారు. దీంతో ఈవీఎంలతోనే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు.