అక్షరటుడే, హైదరాబాద్: 2BHK Housing Scam | ప్రభుత్వ 2BHK ఇళ్లు ఇప్పిస్తామని చెబుతూ అమాయక ప్రజలను మోసగిస్తున్న ఇద్దరు మోసగాళ్లను సుల్తాన్‌బజార్ పోలీసులు Sultan Bazaar police అదుపులోకి తీసుకున్నారు. నకిలీ పత్రాలు, మోసపూరిత హామీలతో 18 మందికి పైగా బాధితుల నుంచి ఈ నిందితులు సుమారు రూ.39 లక్షల వరకు డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
అరెస్టయిన నిందితులను నిజామాబాద్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్‌నగర్ (కాళికా మాత ఆలయం, తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో)కు చెందిన ఫైనాన్స్ కలెక్షన్ బాయ్ ఉసికేట విజయ్ (35), ఖలీల్‌వాడికి చెందిన ఎలక్ట్రీషియన్ అంబం మురళి (54) కలిసి అడ్డదారిలో అందలం ఎక్కాలని మోసాలకు తెర లేపారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సామాన్యులను నమ్మించారు. తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్లో చాలా ఉన్నత హోదాలో ఉన్నట్లు ప్రచారం చేసుకున్నారు.
పలువరు అమాయకులకు ప్రభుత్వ government 2BHK ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి నగదు, ఆన్లైన్ రూపంలో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. అధికారుల నకిలీ సంతకాలు, నకిలీ సీల్స్‌తో 2BHK కేటాయింపు లేఖలను రూపొందించి బాధితులకు అందించారు.
2BHK Housing Scam | ఫిర్యాదుతో వెలుగులోకి..
ఈ ఘటనపై కోటికి చెందిన సామాజిక కార్యకర్త సరస్వతి (51) ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌లో (క్రైం నం. 211/2025) IPC సెక్షన్లు 406, 420, 467, 468, 471 r/w 34 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీసీపీ (ఈస్ట్ జోన్) డా. బి. బాలస్వామి, అదనపు డీసీపీ జే. నూర్సాలహ్, ఏసీపీ ఎం. మత్తయ్య , ఎస్హెచ్ఓ కె. నరసింహ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు, ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును లోతుగా విచారించేందుకు నిందితులను పోలీసు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.