అక్షరటుడే, వెబ్‌డెస్క్ : TGSRTC | హైదరాబాద్ (Hyderabad) నగరంలో కాలుష్యం తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచుతోంది. భవిష్యత్‌లో ఓఆర్ఆర్ (ORR) లోపల ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే నడపాలని గతంలో సీఎం రేవంత్ రెడ్డి సూచించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ నగరంలో 65 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేళ్లలో 2,476 కొత్త బస్సులను సమకూర్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 810 EV బస్సులు సేవలందిస్తున్నాయని చెప్పారు. జనవరి నాటికి హైదరాబాద్‌లో ఈవీ బస్సుల సంఖ్య 540కి చేరుకుంటుందని చెప్పారు. ఈ రోజు 65 బస్సులు ప్రారంభించగా.. జనవరిలో మరో 175 బస్సులు వస్తాయని చెప్పారు. రెండేళ్లలో ఈవీ బస్సుల సంఖ్యను 2800కు పెంచుతామన్నారు.
TGSRTC | మహిళా సంఘాల ఆధ్వర్యంలో..
సెర్ప్ మహిళా శక్తి కింద 152 బస్సులు ఇప్పటికే మహిళా సంఘాలు అద్దె ప్రాతిపదికన నడుపుతున్నాయని మంత్రి తెలిపారు. మరో 448 బస్సులను త్వరలో మహిళా సమాఖ్య గ్రూపులు చేర్చుతాయని చెప్పారు. ప్రజా రవాణా వినియోగం ప్రస్తుతం 28 శాతం ఉండగా.. 2047 వరకు 70 శాతానికి పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. భవిష్యత్ డిమాండ్‌ను తీర్చడానికి RTC దాని ప్రస్తుత వ్యవస్థను 3 రెట్లు పెంచుకోవాలన్నారు.
TGSRTC | లాభాల్లో డిపోలు
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పాలనతో ఇప్పుడు కోలుకుంటోందని చెప్పారు. 90 కి పైగా డిపోలు ఇప్పుడు లాభదాయకంగా ఉన్నాయని వెల్లడించారు. ఆర్టీసీలో 2011లో నియామకాలు జరిగాయన్నారు. ఇప్పుడు 3,038 పోస్టులు (డ్రైవర్లు, శ్రామిక్‌లు, సూపర్వైజర్లు) భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి, ములుగులో కొత్త డిపోలు ఏర్పాటు చేశామన్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం (Mahalakshmi Scheme) కింద రెండేళ్లో 251 కోట్ల మంది ప్రయాణించారన్నారు. ఉచిత ప్రయాణ విలువ రూ.8,500 కోట్లు అని వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం ఆధునిక ఆర్టీసీ పాఠశాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
TGSRTC | హైదరాబాద్ కనెక్ట్ పేరుతో..
హైదరాబాద్ కనెక్ట్ (Hyderabad Connect) పేరుతో ఆర్టీసీ కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. నగరంలో వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాలు, కొత్త కాలనీల వాసులకు మెరుగైన సేవలు అందించేందుకు బస్సు సర్వీస్‌లను నడపనుంది. 373 కొత్త కాలనీలకు ఆర్టీసీ బస్సుల సేవలు అందించాలని ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ నెల నుంచే సేవలు ప్రారంభం కానున్నాయి.