అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vote Chori | కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని ఆయన ఆరోపించారు.
రాహుల్ గాంధీ (Rahul Gandhi) కొంతకాలంగా ఓటు చోరీ పేరిట ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. హర్యానాలో 25 లక్షల ఓట్ల చోరీ (Vote Chori) జరిగిందన్నారు. పోలైన పోస్టల్ ఓట్లకు, ఫలితాలకు తేడా ఉందని ఆరోపించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోనూ ఓట్ల చోరీ జరిగిందన్నారు. హర్యానాలో ఒక యువతికి 10 బూత్‌లలో 22 ఓట్లు ఉన్నాయని తెలిపారు. అయితే ఆ ఫొటోలో ఉన్న యువతి బ్రెజిల్ (Brazil)కు చెందిన మోడల్ అని ఆయన పేర్కొన్నారు.
Vote Chori | ఒకే ఫొటోతో..
హర్యానాలో 2 కోట్ల ఓటర్లుంటే.. 25 లక్షల ఓట్లను దొంగలించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒకే ఫొటోతో ఒకే అసెంబ్లీ స్థానంలో 100 ఓట్లు ఉన్నాయన్నారు. ఓ మహిళ పేరు రెండు పోలింగ్ కేంద్రాల్లో 223 సార్లు ఉందని పేర్కొన్నారు. ఓటు చోరీ కావడంతోనే తాము హర్యానాలో ఓడిపోయామని ఆయన తెలిపారు. హర్యానా ఎన్నికల జాబితాలోని ఎనిమిది మంది ఓటర్లలో ఒకరు నకిలీవారని అన్నారు.
హర్యానాలో తమ అభ్యర్థుల నుంచి ఏదో తప్పు జరిగిందని ఫిర్యాదులు వచ్చాయన్నారు. వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయని చెప్పారు. దీంతో హర్యానాలో ఏం జరిగిందో తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.
Vote Chori | ఈసీ, బీజేపీ కుట్ర
హర్యానాలో కాంగ్రెస్ (Congress) విజయం సాధిస్తుందని సర్వేలు తెలిపాయన్నారు. అయితే భారీ విజయాన్ని ఓటమిగా మార్చడానికి ఎన్నికల కమిషన్, బీజేపీ కుట్ర పన్నాయని ఆయన ఆరోపించారు. దేశ యువత, జెన్ జెడ్ దీనిని అర్థం చేసుకోవాలని కోరారు. అయితే, ఎన్నికల కమిషన్ వర్గాలు రాహుల్ గాంధీ వాదనలను తోసిపుచ్చాయి. రాష్ట్ర ఓటర్ల జాబితాకు వ్యతిరేకంగా ఎటువంటి అప్పీళ్లు దాఖలు చేయలేదని చెప్పారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో ప్రస్తుతం 90 అసెంబ్లీ స్థానాల్లో 22 ఎన్నికల పిటిషన్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు.
