అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Commonwealth Games 2030 | కామన్వెల్త్ గేమ్స్ 2030 నిర్వహణ హక్కులు భారత్ దక్కించుకుంది. ఈ పోటీల నిర్వహణకు గతంలో భారత్ ఆసక్తి చూపింది. ఈ మేరకు బుధవారం జరిగిన కామన్వెల్త్ స్పోర్ట్స్ జనరల్ అసెంబ్లీ సందర్భంగా అహ్మదాబాద్‌కు ఆతిథ్య హక్కులను అధికారికంగా అందజేశారు. 2010లో కామన్వెల్త్ గేమ్స్ ఢిల్లీలో జరిగాయి.
గత నెలలో కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు అహ్మదాబాద్ (Ahmedabad)ను శతాబ్ది ఎడిషన్‌కు ప్రతిపాదిత హోస్ట్‌గా సిఫార్సు చేసింది. అనంతరం 74 మంది సభ్యుల జనరల్ అసెంబ్లీ భారతదేశం బిడ్‌పై ఆమోద ముద్ర వేసింది. గతంలోనే ఇది ఖరారు అయినా.. బుధవారం అధికారికంగా ప్రకటించారు. కామన్వెల్త్ స్పోర్ట్స్ మూల్యాంకన కమిటీ పర్యవేక్షించిన ప్రక్రియను అనుసరించి ఎగ్జిక్యూటివ్ బోర్డు సిఫార్సు చేసింది.
భారత్ స్కేల్, యువత, ఆశయం, గొప్ప సంస్కృతి, అపారమైన క్రీడా అభిరుచి, ఔచిత్యాన్ని తెస్తుందని, కామన్వెల్త్ గేమ్స్ కోసం మా తదుపరి శతాబ్దాన్ని మంచి ఆరోగ్యంతో ప్రారంభిస్తామని కామన్వెల్త్ స్పోర్ట్స్ అధ్యక్షుడు డాక్టర్ డోనాల్డ్ రుకరే అన్నారు. ఈ నిర్ణయం 2036లో ఒలింపిక్స్ (Olympics)కు ఆతిథ్యం ఇవ్వాలనే భారతదేశ ఆశయాన్ని మరింత బలపరిచింది. ఒలింపిక్ ఆతిథ్య హక్కుల కోసం పోటీలో ఉన్న అహ్మదాబాద్ నగరం గత దశాబ్దంలో తన క్రీడా మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన అప్‌గ్రేడ్ చేసింది.
Commonwealth Games 2030 | నైజీరియా నుంచి పోటీ
కామన్వెల్త్ నిర్వహణ కోసం భారత్‌కు నైజీరియా నగరం అబుజా నుంచి పోటీ ఎదరైంది. కానీ కామన్వెల్త్ స్పోర్ట్ 2034 ఎడిషన్ కోసం ఆఫ్రికన్ దేశాన్ని పరిగణించాలని నిర్ణయించింది. భారతదేశం 2010 ఎడిషన్ గేమ్స్‌ను నిర్వహించడానికి దాదాపు రూ. 70,000 కోట్లు ఖర్చు చేసింది, ఇది ప్రారంభ అంచనా రూ.1,600 కోట్ల కంటే చాలా ఎక్కువ. కామన్వెల్త్ క్రీడ చూపిన విశ్వాసం మాకు ఎంతో గౌరవాన్ని కలిగిస్తోందని కామన్వెల్త్ క్రీడల సంఘం, IOA అధ్యక్షురాలు PT ఉష తెలిపారు. 2030లో 15 నుంచి 17 క్రీడలు ఉంటాయని వెల్లడించారు.
Commonwealth Games 2030 | ఈ విభాగాల్లో పోటీలు
అథ్లెటిక్స్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, బౌల్స్, వెయిట్ లిఫ్టింగ్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, నెట్‌బాల్, బాక్సింగ్ తదితర క్రీడల్లో పోటీలు ఉంటాయి. అలాగే విలువిద్య, బ్యాడ్మింటన్, 3×3 బాస్కెట్‌బాల్, బీచ్ వాలీబాల్, క్రికెట్ T20, సైక్లింగ్, డైవింగ్, హాకీ, జూడో, రిథమిక్ జిమ్నాస్టిక్స్, రగ్బీసెవెన్స్, షూటింగ్, స్క్వాష్, ట్రయాథ్లాన్, రెజ్లింగ్ వంటి పోటీలను సైతం పరిశీలిస్తున్నారు. ఆతిథ్య దేశం రెండు కొత్త, సంప్రాదాయ క్రీడలను ప్రతిపాదించే అవకాశం ఉంది. కాగా కామన్వెల్త్ 2026 గేమ్స్ గ్లాస్గోలో జరగనున్నాయి. ఇక్కడ 10 విభాగాలతో స్కేల్ డౌన్ ఈవెంట్ అవుతుంది.