అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tollywood 2025 Review | 2025 సంవత్సరం టాలీవుడ్‌కు ఆశించిన స్థాయిలో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందని ఏడాదిగా మిగిలిపోయింది. భారీ అంచనాలతో విడుదలైన పలు పెద్ద బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడగా, కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు మాత్రం అనూహ్యంగా సూపర్ సక్సెస్ సాధించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి.
మరోవైపు, పలువురు టాప్ స్టార్లు ఈ ఏడాది థియేటర్లకు రాకుండా సైలెంట్‌గా ఉండిపోయారు. సాధారణంగా టాలీవుడ్లో పండుగ సీజన్లలో స్టార్ హీరోల సినిమాలు సందడి చేస్తుంటాయి. కానీ 2025లో మాత్రం కొద్ది మంది హీరోలే బాక్సాఫీస్ వద్ద హడావిడి చేశారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున మాత్రమే రెండేసి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మిగతా హీరోలు ఒక్క సినిమాతో పరిమితమయ్యారు, కొందరు పూర్తిగా గ్యాప్ తీసుకున్నారు.
Tollywood 2025 Review | పెద్ద హీరోలు సైలెంట్..
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద నిజంగా సత్తా చాటిన హీరోగా విక్టరీ వెంకటేష్ నిలిచారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో 2025కి సాలిడ్ ఓపెనింగ్ ఇవ్వడమే కాకుండా, తన కెరీర్లోనే బెస్ట్‌గా నిలిచేలా రూ.300 కోట్ల వసూళ్లతో భారీ విజయాన్ని అందుకున్నారు. పవన్ కళ్యాణ్‌కు 2025 మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘హరిహర వీరమల్లు పార్ట్-1’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే మరోవైపు ‘ఓజి’ చిత్రం అభిమానులకు ఊరటనిచ్చింది. ఈ సినిమా 2025లో హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలవడంతో పాటు పవన్ స్టామినా ఏమిటో మరోసారి నిరూపించింది. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఈ ఏడాది ‘డాకు మహారాజ్’, ‘అఖండ 2 – తాండవం’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘డాకు మహారాజ్’ యావరేజ్ టాక్‌తో పరిమిత వసూళ్లకే పరిమితమైంది. ఇక ‘అఖండ 2’ అనేక అడ్డంకులను దాటి థియేటర్లలో విడుదలై మంచి స్పందన దక్కించుకున్నా, తొలి భాగం స్థాయి వసూళ్లను అందుకోలేకపోయింది.
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) 2025లో లీడ్ రోల్స్ కాకుండా ‘కుబేర’, ‘కూలీ’ చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించారు. ఆయన నటనకు ప్రశంసలు లభించినప్పటికీ, బాక్సాఫీస్ పరంగా ఈ సినిమాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒక్కొక్క సినిమా మాత్రమే చేశారు. రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’, ఎన్టీఆర్ ‘వార్ 2’తో ప్రేక్షకుల ముందుకొచ్చినా, భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాయి. అయితే 2026లో రాబోయే ‘పెద్ది’, ‘డ్రాగన్’ సినిమాలపై ఇప్పటికే బలమైన బజ్ నెలకొంది.
ఇక ప్రభాస్, చిరంజీవి, మహేష్ బాబు, అల్లు అర్జున్ (Allu Arjun)వంటి టాప్ స్టార్లు 2025లో పూర్తి స్థాయి థియేట్రికల్ రిలీజులు లేకుండా గ్యాప్ తీసుకున్నారు. ప్రభాస్ ‘కన్నప్ప’లో అతిథి పాత్రలో కనిపించినా, అది లీడ్ మూవీగా పరిగణనలోకి రాలేదు. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలోని ‘వరాణాసి’ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉండగా, ఆయన తదుపరి థియేట్రికల్ రిలీజ్ 2027కు షెడ్యూల్ అయ్యింది. అల్లు అర్జున్ కూడా ‘పుష్ప 2’ తర్వాత 2027లో అట్లీ ప్రాజెక్ట్‌తో తిరిగి రానున్నారు.
మొత్తంగా 2025 టాలీవుడ్‌కు స్టార్ పవర్ పరంగా పెద్దగా చెప్పుకునే సంవత్సరం కాకపోయిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే 2026 మాత్రం పరిశ్రమకు కీలకంగా మారనుంది. వచ్చే సంక్రాంతికి ప్రభాస్ ‘ది రాజా సాబ్’, చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాలతో బాక్సాఫీస్‌ను టెస్ట్ చేయనున్నారు. అలాగే ప్రభాస్‌కు ‘ఫౌజీ’, చిరంజీవికి ‘విశ్వంభర’, రామ్ చరణ్‌కు ‘పెద్ది’, ఎన్టీఆర్‌కు ‘డ్రాగన్’ వంటి భారీ ప్రాజెక్టులు లైనప్‌లో ఉండటంతో, టాలీవుడ్ మళ్లీ ఊపందుకుంటుందన్న నమ్మకం ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది.