అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Narmada River | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రం ఖర్గోన్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. నర్మదా నది (Narmada River) తీరంలో అందంగా ఎగిరే చిలుకలు ఒక్కసారిగా విగతజీవులుగా మారాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200కు పైగా చిలుకలు మృతి చెందడం పక్షి ప్రేమికులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది.
నది ఒడ్డున చెల్లాచెదురుగా పడి ఉన్న పక్షుల మృతదేహాలను చూసిన స్థానికులు గుండె పగిలినట్టుగా మారింది. ఈ దృశ్యం చూసి పలువురు కన్నీళ్లు పెట్టుకున్నారు. చిలుకలతో పాటు పావురాలు (parrots, pigeons)కూడా ఇదే విధంగా మరణించాయి. ఖర్గోన్ జిల్లాలోని బద్వా ప్రాంతంలో నర్మదా నది తీరంలోని ఒక కాలువ వంతెన సమీపంలో గత నాలుగు రోజులుగా పక్షుల మృతదేహాలు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Narmada River | వందల్లో మృతి..
మొదట భారీ సంఖ్యలో పక్షులు Parrots చనిపోవడానికి బర్డ్ ఫ్లూ కారణమై ఉండొచ్చని అనుమానించారు. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే పోస్టుమార్టం నివేదికలో అసలు నిజం బయటపడింది. ఈ మరణాలకు బర్డ్ ఫ్లూ కారణం కాదని, విషపూరిత ఆహారం తీసుకోవడం వల్లే పక్షులు మృతి చెందినట్లు తేలింది. పర్యాటకులు లేదా స్థానికులు వేసిన కలుషిత అన్నం లేదా విషం కలిపిన గింజలను ఆహారంగా తీసుకోవడంతో చిలుకలు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు నేలపై పడి ఉన్న కొన్ని చిలుకలు ఇంకా ప్రాణాలతో ఉండటాన్ని గమనించి కాపాడే ప్రయత్నం చేశాయి. కానీ విష ప్రభావం తీవ్రంగా ఉండటంతో అవి కొద్దిసేపటికే మృతి చెందినట్లు జిల్లా వన్యప్రాణి వార్డెన్ టోనీ శర్మ తెలిపారు.
పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన పశువైద్యురాలు డాక్టర్ మనీషా చౌహాన్ మాట్లాడుతూ, చిలుకల్లో బర్డ్ ఫ్లూకు (Bird Flu) సంబంధించిన ఎలాంటి లక్షణాలు లేవని స్పష్టం చేశారు. ఆహార విషప్రయోగానికి సంబంధించిన లక్షణాలే కనిపించాయని వెల్లడించారు. మరణించిన పక్షుల కడుపులో బియ్యం, చిన్న గులకరాళ్లు లభించినట్లు పశువైద్య విస్తరణ అధికారి డాక్టర్ సురేష్ బఘేల్ తెలిపారు.
ఈ ఘటన తర్వాత అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో తక్షణ చర్యలు చేపట్టారు. అక్విడక్ట్ వంతెన సమీపంలో పక్షులకు ఆహారం వేయడంపై నిషేధం విధించారు. ఎవరూ అక్కడ ఆహారం వేయకుండా సిబ్బందిని నియమించారు. అంతేకాదు, పక్షుల అంతర్గత అవయవాల నమూనాలను తదుపరి పరీక్షల కోసం జబల్పూర్కు (Jabalpur) పంపించారు. పశువైద్య, అటవీ శాఖలతో పాటు వన్యప్రాణి విభాగం బృందాలు గత నాలుగు రోజులుగా ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నాయి.