అక్షరటుడే, ఎల్లారెడ్డి: Group 1 Jobs | నిరంతర కృషి, అంకితభావంతో శ్రమిస్తే ఎంతటి విజయమైనా చేరుకోవచ్చని నిరూపించాడు ఎల్లారెడ్డికి (Yellareddy ) చెందిన శశికుమార్. ఇటీవల వెలువడిన గ్రూప్–1 ఫలితాల్లో స్టేట్ లెవెల్‌లో 98వ ర్యాంక్, మల్టీ జోన్‌లో 54వ ర్యాంక్ సాధించి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు.
Group 1 Jobs | ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూనే..
ఓ వైపు ఉపాధ్యాయ వృత్తిలో 20 ఏళ్లు పని చేస్తూనే, పరిశోధనలు చేసి డాక్టరేట్ పొందారు. అంతిమంగా గ్రూప్–1 లక్ష్యాన్ని సాధించి, అందరి మన్ననలు అందుకుంటున్నారు. వివారాల్లోకి వెళ్తే.. శశికుమార్ తల్లిదండ్రులు మున్నం రాములు, ఇందిర. ఇద్దరూ రిటైర్డ్ టీచర్లు. భార్య మమత కూడా టీచర్‌గా పని చేస్తున్నారు. శశికుమార్ దంపతులకు ఆదిత్ర, శ్రీశాశ్వత్ ఇద్దరు సంతానం.
శశి కుమార్ ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశారు. ఇంటర్ సైతం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి, 2003లో బాన్సువాడలోని ఎస్‌ఆర్‌ఎన్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (SRNK Degree College) డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం దూరవిద్య ద్వారా మూడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు పూర్తి చేశారు.
బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో హిస్టరీ విభాగంలో గోల్డ్ మెడల్, ఉస్మానియా యూనివర్సిటీలో (Osmania University) తెలుగు, భోజ్ యూనివర్సిటీలో ఫిజిక్స్, తెలుగు, హిస్టరీలో యూజీసీ నెట్ అర్హత సాధించి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొందారు. అంతేకాకుండా, తెలుగులో పీహెచ్‌డీ చేసి 2024లో డాక్టరేట్ పొందారు.
Group 1 Jobs | జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగం వచ్చినప్పటికీ..
2005 నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే, ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్‌సీ) (TGPSC) నిర్వహించిన పరీక్షల్లో జూనియర్ లెక్చరర్‌గా ఎంపికై, ప్రస్తుతం ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిస్టరీ బోధిస్తున్నారు. అయితే, గ్రూప్–1 లక్ష్యంగా నిరంతరం కష్టపడ్డారు. ఎట్టకేలకు అనుకున్న లక్ష్యం చేరుకున్నాడు. ఉపాధ్యాయుడిగా పని చేస్తూనే పరిశోధనలు, చదువులు కొనసాగించానని, వైఫల్యాలు వచ్చినా ప్రయత్నాన్ని ఆపలేదని శశికుమార్ పేర్కొన్నారు. ఎట్టకేలకు గ్రూప్–1 సాధించడం ఆనందంగా ఉందన్నారు.