అక్షరటుడే, ఇందూరు: Panchayat Elections | గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లు 18రకాల గుర్తింపు కార్డులు వినియోగించవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. తమ ఓటు (Vote) హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లే సమయంలో 18 రకాల గుర్తింపు కార్డులో ఏదైనా కార్డు తీసుకెళ్లాలని సూచించారు.
కార్డులివే..
ఇందులో భాగంగా ఓటర్ కార్డు, ఆధార్ కార్డు(Aadhar Card), జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డు, ఫొటోతో కూడిన పోస్ట్ ఆఫీస్ బుక్, బ్యాంక్ పాస్ బుక్, కార్మిక మంత్రిత్వ శాఖ(Ministry of Labor) ఇచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్ చూపించవచ్చని పేర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఫొటోతో కూడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల ధ్రువీకరణ పత్రాలు, ఇండియన్ పాస్పోర్ట్, ఫొటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో జారీ చేయబడిన ఉద్యోగ గుర్తింపు కార్డుతో సైతం ఓటు వేయవచ్చని వివరించారు.
అలాగే ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు ఇచ్చిన అధికారిక గుర్తింపు కార్డు, దివ్యాంగుల గుర్తింపు కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, రేషన్ కార్డు, ఫోటోతో కూడిన ఆయుధ లైసెన్స్ పత్రం, ఫ్రీడమ్ ఫైటర్ ఐడీ కార్డ్, ఆర్జీఐ ద్వారా జారీ చేయబడిన ఎన్పీఆర్ స్మార్ట్ కార్డ్ చూయించి ఓటును వేయవచ్చని ఆయన స్పష్టం చేశారు.