అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Anganwadi posts | రాష్ట్రంలో త్వరలో భారీగా నియామకాలు చేపడుతామని మంత్రి సీతక్క (Minister Seethakka) తెలిపారు. 14 వేల అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల పోస్టులను భర్తీ చేస్తామన్నారు.
మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్–1 సూపర్‌వైజర్లుగా నియమితులైన వారికి మంత్రి శనివారం రాజేంద్రనగర్ (Rajendra Nagar)లో నియామక పత్రాలు అందించారు. టీజీపీఎస్సీ (TGPSC) నిర్వహించిన పరీక్షల్లో సత్తా చాటి 181 మంది కొలువులు సాధించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. త్వరలో 14వేల అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల నియామకం చేపడుతామని తెలిపారు. మహిళా శిశు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
Anganwadi posts | బలోపేతం చేస్తాం
అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తామని మంత్రి తెలిపారు. దేశంలో మొదటిసారి అంగన్‌వాడీ కేంద్రాలను తెలంగాణలో ఏర్పాటు చేసినట్లు ఆమె గుర్తు చేశారు. 1970లో మహబూబ్‌గర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారని తెలిపారు. అది విజయవంతం కావడంతో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా అమలు చేశారన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను పౌష్టికాహారానికే పరిమితం చేయకుండా.. ప్రాథమిక విద్యను సైతం అందిస్తున్నట్లు వివరించారు. కేంద్రాల్లో చిన్నారులకు యూనిఫామ్‌లు, 57 రకాల ఆట వస్తువులు అందజేస్తున్నట్లు తెలిపారు.
Anganwadi posts | సూపర్‌వైజర్ల పాత్ర కీలకం
నియామక పత్రాలు అందుకున్న సూపర్వైజర్లు తప్పటడుగులు వేయకుండా విధులు నిర్వహించాలని సూచించారు. ఒక్కో సూపర్‌వైజర్ కింద 25 అంగన్‌వాడీ కేంద్రాలు ఉంటాయన్నారు. పోషకాహార లోపాన్ని నిర్మూలించడంలో సూపర్‌వైజర్ల పాత్ర కీలకమన్నారు. త్వరలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టులను భర్తీ చేసిన తర్వాత అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ మరింత మెరుగుపడి, చిన్నారులకు, గర్భిణులకు అందాల్సిన సేవల్లో నాణ్యత పెరుగుతుందన్నారు.
